శ్రీనగర్ : ఈ 22 నుంచి 24 వరకు జి 20 సదస్సుకు సంబంధించి టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం జరగనున్నందున షేర్ ఇకాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (ఎస్‌కెఐఐసి) చుట్టూ భద్రతను మరింత పటిష్టం చేశారు. పోలీస్, సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సిఆర్‌పిఎఫ్) , పారామిలిటరీ దళాలే కాకుండా ఎన్‌ఎస్‌జి , మెరైన్ కమాండోలను కూడా అప్రమత్తం చేశారు. అత్యంత ఉన్నత స్థాయిలో జరుగుతున్న ఈ సమావేశం సజావుగా నిర్వహించేలా పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేయడమౌతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గురువారం మెరైన్ కమాండోస్ సమావేశ వేదిక సమీపాన గల ప్రఖ్యాత డాల్ సరస్సు పరిసరాల పరిశుభ్రత నిర్వహించారు.
సరస్సు చుట్టూ ఉన్న నివాసాలను తనిఖీ చేశారు. సరస్సులో కూడా షికారాలు నిర్వహించారు. నగరం లోని లాల్ చౌక్ ఏరియాల్లో నేషనల్ సెక్యూరిటీ గార్డు కమాండోస్ భద్రతా పరమైన తనిఖీలు చేశారు. విధ్వంసక కార్యకలాపాలకు అవకాశం లేని విధంగా నగరం మీదుగా వెళ్తున్న వాహనాల రాకపోకలను యాధృచ్ఛికంగా తనిఖీ చేశారు. సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తామని అధికారులు వివరించారు. పోలీస్‌లు యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. డ్రోన్ జోన్ రహిత ప్రాంతంగా నగరాన్ని సన్నద్ధం చేశారు. ఈ సదస్సుకు సంబంధించి వదంతులు వ్యాప్తి చేసే ప్రమాదం ఉంటుందని, అందుకని అలాంటి అనుమానాస్పద అంతర్జాతీయ మొబైల్ నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీస్‌లు ప్రజలను హెచ్చరించారు. అయితే అలాంటి మొబైల్ నంబర్ల నుంచి ఈ కార్యక్రమాలను బహిష్కరించాలని హెచ్చరిస్తూ మెసేజ్‌లు వస్తున్నాయి.