Tuesday, September 17, 2024

పేట్రేగిన ఉగ్రవాదం

- Advertisement -
- Advertisement -

Sampadakiyam

 

ప్రపంచమంతా కరోనా మృత్యుపదఘట్టనల నుంచి కాపాడుకునే యత్నంలో ప్రాణాలరచేత పట్టుకొని తల్లడిల్లుతుండగా సందట్లో సడేమియా అన్నట్టు ముష్కర ఉగ్రవాదులు తమ రక్తదాహాన్ని తీర్చుకుంటున్నారు. విద్రోహ కాండను విచ్చలవిడిగా సాగిస్తూ అడ్డు వచ్చిన వారిని హతమారుస్తున్నారు. పాకిస్థాన్‌లో తమకు లభిస్తున్న ఆశ్రయాదరణలతో భారత గడ్డ మీద దొడ్డిదారి దాడులకు తెగబడుతున్నారు. కశ్మీర్ కుప్వారా జిల్లాలోని హంద్వారా ప్రాంతంలో గత వారాంతంలోనూ, సోమవారం నాడు జరిగిన టెర్రరిస్టు దాడుల్లో ఒక కల్నల్ సహా భారత భద్రతా దళాల సిబ్బంది 8 మంది దుర్మరణం పాలుకావడం ఉగ్రమూకల బరితెగింపును చాటుతున్నది. ఈ ఘటనల్లో ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తాయిబా ఉన్నత శ్రేణి కమాండర్, పాకిస్థానీయుడు హైదర్ సహా ఇద్దరు టెర్రరిస్టులు కూడా మృతి చెందారు. గత వారాంతంలో జరిగిన తొలి ఘటనలో టెర్రరిస్టులకు బందీలుగా చిక్కిన పౌరులను విముక్తం చేయడానికి ప్రయత్నిస్తుండగా కల్నల్ అశుతోష్ శర్మ, ముగ్గురు భద్రతా దళ యోధులు, ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ మరణించారు.

సోమవారం నాడు అదే ప్రాంతంలోని కాజియాబాద్ వద్ద జరిగిన మరో దాడిలో ముగ్గురు సిఆర్‌పిఎఫ్ జవాన్లు నేలకొరిగారు, మరి ఏడుగురు గాయపడ్డారు. ఒకే ప్రాంతంలో రెండు మూడు రోజుల అతిస్వల్ప వ్యవధిలోనే ఉగ్రవాదులు ఇంతగా పేట్రేగి పెచ్చరిల్లిపోడాన్ని యాదృచ్ఛిక పరిణామంగా ఎంత మాత్రం పరిగణించలేము. పాక్ ప్రేరిత టెర్రరిస్టులు హంద్వారాలో గాఢమైన కుట్రనే పన్నారని, విద్రోహ కాండను ఒక పథకం ప్రకారం అమలు చేస్తున్నారని భావించక తప్పదు. జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో అనునిత్యం అప్రమత్తంగా ఉండే భద్రతా దళాలు, టెర్రరిస్టుల మోహరింపును విద్రోహ కుట్రను ముందుగా పసిగట్టి ఎందుకు భగ్నం చేయలేకపోయాయో, అందుకు దారి తీసిన వాస్తవ పరిస్థితులేమిటో వివరంగా తెలియవలసి ఉంది. హంద్వారాలో మళ్లీ మరొక్కసారి దుర్భేద్యమైన టెర్రరిస్టు స్థావరాలు ఏర్పడ్డాయని, ఇంకా పెక్కు మంది ఉగ్రవాదులు అక్కడ తిష్ఠ వేసుకొని ఉంటారని భావించడానికి ఆస్కారం కలుగుతున్నది.

ఆక్రమిత కశ్మీర్‌లోని శారద, దుద్ధియాల్, ఆత్ముఖమ్ ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ వెంట ఉగ్రవాద స్థావరాలను పాకిస్థాన్ పటిష్ఠం చేసిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అందుచేత ఇటువంటి దాడులు ముందు ముందు మళ్లీ జరగవచ్చునని హెచ్చరించాయి. పాకిస్థాన్‌లోని నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలు నడుపుతున్న ఉగ్రవాద ముఠాలు ఉత్తర కశ్మీర్‌ను లక్షంగా చేసుకున్నాయని అందుకు హంద్వారా ప్రాంతాన్ని ఎంచుకున్నాయని ఈ వర్గాలు భావిస్తున్నాయి. బుదా ్గమ్ జిల్లాలో మన అర్ధ సైనిక దళాలను లక్షంగా చేసుకొని టెర్రరిస్టులు ఇటీవల అనేక సార్లు గ్రెనేడ్ దాడులకు పాల్పడ్డారు. హంద్వారా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల స్థావరంగా మారడం ఇదే మొదటిసారి కాదు. పాక్ అఫ్ఘాన్‌లలో శిక్షణ పొందిన జిహాదీలు 1990 దశకంలోనూ ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని దాడులకు తెగబడ్డారు. అప్పుడు కూడా అనేక మంది భారత యోధులు అమరులయ్యారు.

ఆ తర్వాత భారత సైన్యం అక్కడ ఉగ్ర స్థావరాలను నిర్మూలించడంలో విజయవంతమైంది. ఇప్పుడు ప్రపంచమంతా మృత్యు కరోనాతో పోరులో తలమునకలై ఉన్నప్పుడు విద్రోహ కాండను పెంచాలని ఉగ్రవాదులు, వారికి దన్నుగా ఉన్న పాకిస్థాన్ తలపెట్టడం కంటే అమానుషం వేరొకటి ఉండదు. వారిలో మానవతా కోణం తెరుచుకుంటుందని, దాని ప్రభావంతో దాడులకు విరామం ప్రకటిస్తారని ఆశించడం అవివేకం. నెల రోజుల క్రితం కశ్మీర్‌లోని కెరన్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్ద సంభవించిన ఎదురు కాల్పుల్లో మన సైనిక కమాండోలు ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. పాకిస్థాన్ మన భూభాగంలోకి అదే పనిగా టెర్రరిస్టులను పంపుతున్నదని సందు చిక్కినప్పుడల్లా వారు దాడులకు పాల్పడుతున్నారని బోధపడుతున్నది. అయితే మన నిఘా వర్గాలు తగినంత అప్రమత్తతతో వ్యవహరించి ఉంటే వీరి కదలికలను సకాలంలో కనుగొని మట్టుబెట్టడం కష్టతరం కాదు.

కరోనా వల్ల ఎదురైన విశ్వ విపత్తులో టెర్రరిస్టులు ఇటువంటి దుస్సాహస దాడులకు పాల్పడబోరనే భావన వారిని ప్రమత్తులను చేసి ఉండాలి. గత వారాంతంలో ఉగ్రదాడికి బలైపోయిన కల్నల్ అశుతోష్ శర్మ 21 మందితో కూడిన ప్రతిష్ఠాత్మక రాష్ట్రీయ రైఫిల్స్ దళం రెండవ కమాండింగ్ ఆఫీసర్. ఆయన మృతి మన భద్రతా దళాలకు భారీ నష్టంగా భావిస్తున్నారు. ఈ దాడులకు తగిన సమాధానం చెబుతామని మన సైనిక దళాల ప్రధానాధికారి నరవాణే హెచ్చరించారు. పాకిస్థాన్ టెర్రరిస్టులను మంత్రించి మన పైకి ప్రయోగించే దుర్విధానానికి ఇకనైనా స్వస్తి చెప్పాలని లేనిపక్షంలో తీవ్రమైన మూల్యాన్ని చెల్లించుకోవలసి ఉంటుందని అన్నారు. టెర్రరిజాన్ని మట్టుబెట్టడానికి దీక్షాకంకణం కట్టుకున్న ప్రధాని మోడీ ప్రభుత్వం పాకిస్థాన్‌ను అంతర్జాతీయ సమాజం ఎదుట మరింతగా పలచబర్చడం ద్వారా అది మంచి దారికి మళ్లేలా చేయాలి. ఆ విధంగా టెర్రరిస్టుల పీడకు శాశ్వత విరగడ సాధించాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News