మణిపూర్ లోని కాంగ్‌పోక్పి జిల్లాలో తాజాగా సంఘర్షణలు తలెత్తాయి. రాష్ట్రంలో ఇక ఎలాంటి అడ్డులేకుండా ఈనెల 8 నుంచి ప్రజలు సంచరించవచ్చని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదేశాలు జారీ చేయడమే ఘర్షణలకు కారణమైంది. మెయిటీ వర్గం నేతృత్వంలో శాంతి ప్రదర్శన నిర్వహిస్తుండగా, దీనికి కొందరు అసమ్మతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ తలెత్తడంతో కొందరు రాళ్లు విసరడం, గాయాలు పాలవడం జరిగింది. కొన్ని ప్రైవేట్ వాహనాలను కూడా ఆందోళన కారులు దగ్ధం చేశారు. ఇంఫాల్ నుంచి సెనాపటి జిల్లాకు వెళ్తున్న రాష్ట్ర రవాణా బస్సును ఆపడానికి ప్రయత్నించారు. ఇంఫాల్ డిమాపూర్ రెండో జాతీయ రహదారిపై ఎలాంటి వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. టైర్లను దగ్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు.
మెయిటీ వర్గానికి చెందిన ఫెడరేషన్ ఆఫ్ సివిల్ సొసైటీ (ఎఫ్‌ఒసిఎస్) శాంతి ర్యాలీకి వ్యతిరేకంగా కూడా ఆందోళన సాగించారు. శాంతిర్యాలీలో సాగుతున్న పది వాహనాలను సెక్మాల్ వద్ద భద్రతా బలగాలు ఆపివేశాయి. అనుమతి లేనందున శాంతి ర్యాలీని ఆపేశామని భద్రతా బలగాలు పేర్కొన్నాయి. శనివారం నుంచి రాష్ట్రంలో స్వేచ్ఛగా ప్రజలు రాకపోకలు సాగించవచ్చని కేంద్ర మంత్రి అమిత్‌షా ఆదేశాల ప్రకారం ర్యాలీని నిర్వహిస్తున్నామని ఎఫ్‌ఒసిఎస్ సభ్యులు చెప్పినా భద్రతా బలగాలు వారిని అనుమతించలేదు. అయితే ఈలోగా కుకిజో గ్రామం వాలంటీర్ల గ్రూపు నుంచి గుర్తుతెలియని ప్రదేశం నుంచి వీడియో విడుదలైంది. ప్రత్యేక పాలన అమలు కోసం తాము డిమాండ్ చేస్తున్నామని, అందువల్ల అంతవరకు స్వేచ్ఛగా జనసంచారం కుదరదని, ఎవరైనా తమ ప్రాంతం లోకి ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వీడియో ద్వారా హెచ్చరించారు.