దేశంలో ఇంకా కొనసాగుతున్న రాజద్రోహ చట్టం, పౌరస్వేచ్ఛల సంహారం గురిం చి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గురువారం నాడు మాట్లాడినట్టు గతంలో ఆ పీఠం మీద కూర్చున్నవారెవరూ మాట్లాడి ఉండరు. ప్రజాస్వామిక స్వేచ్ఛల పట్ల దేశ అత్యున్నత న్యాయస్థాన అధ్యక్ష పీఠం నుంచి ఇంతటి బాధ్యత, ఆవేదన గల అభిప్రాయాలు ఇంతకు ముందు ఎప్పుడూ వచ్చి ఉండవని అనిపించేలా ప్రశ్నించే వారి నోటిని బలవంతంగా మూసివేస్తున్న దుస్థితి గురించి జస్టిస్ రమణ ఎలుగెత్తి మాట్లాడారు. ఇది దేశంలో పలు రకాల పాలక నిర్బంధాలను, నిరంకుశత్వాలను అనుభవిస్తున్న స్వేచ్ఛావాదులకు చెప్పనలవికానంత ఊరట కలిగిస్తుంది. భారత శిక్షాస్మృతి లోని 124ఎ రూపంలో కొనసాగుతున్న రాజద్రోహ చట్టమే కాదు, చట్ట విరుద్ధ కార్యకలాపాల (నిరోధక) శాసనం (ఉపా), జాతీయ దర్యాప్తు (ఎన్ఐఎ) చట్టం వంటి దారుణమైన కేంద్ర శాసనాలతోపాటు, రాష్ట్రాల్లోని మరెన్నో పీడక చట్టాలు అసమ్మతిని నోరు మెదపనీయకుండా చేస్తున్నాయి.
రాజద్రోహ చట్టం వలస పాలకులనాటిదని, స్వేచ్ఛలను అణగదొక్కి హరించడమే దాని పని అని, మహాత్మా గాంధీ, తిలక్లపై కూడా ప్రయోగించారని జస్టిస్ రమణ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నప్పటికీ ఈ చట్టం అవసరం ఇంకా ఉందా అని ప్రశ్నించారు. ఐపిసి 124 ఎ సెక్షన్ రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్జి వొంబాట్కెరే దాఖలు చేసిన వ్యాజ్యాన్ని తన అధ్యక్షతన గల ధర్మాసనం పరిశీలించిన సందర్భంలో జస్టిస్ రమణ ప్రభుత్వం తరపున హాజరైన అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్నుద్దేశించి ఈ అభిప్రాయాలు వెలిబుచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాం గం 19(1) (ఎ) అధికరణ వాక్ స్వాతంత్య్రాన్ని హామీ ఇస్తున్నదని అటువంటప్పుడు మాట్లాడితే రాజద్రోహ నేరారోపణ చేసి జైల్లో తోసేందుకు వినియోగపడే ఈ చట్టం ఎందుకని పిటిషనర్ ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. ఈ సెక్షన్ను కొనసాగించినంత కాలం దానిని దుర్వినియోగం చేసే అవకాశాలే ఎక్కువని జస్టిస్ రమణ కూడా అభిప్రాయపడ్డారు. ఈ సెక్షన్ కింద వేధించడమే జరుగుతున్నది గాని శిక్షలు పడుతున్న సందర్భాలు బహు తక్కువని ఆయన అన్నారు.
కార్యనిర్వాహక వ్యవస్థ, అధికారులు దీనిని దుర్వినియోగం చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులన్నింటినీ కలిపి విచారించడానికి నిర్ణయించారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు ఇవ్వదలచినట్టు సిజెఐ చెప్పారు. జస్టిస్ రమణ అన్నట్టు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు గాంధీజీ ని 1922లో బ్రిటిష్ పాలకులు బొంబాయిలో అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనకు ఆరేళ్లు శిక్ష విధించారు. అయితే రెండేళ్లు శిక్ష అనుభవించిన తర్వాత ఆరోగ్య కారణాలపై విడుదల చేశారు. ఆయనకు ముందు ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు తిలక్ పైన కూడా మూడు సందర్భాల్లో ఈ చట్టాన్ని ప్రయోగించారు. బ్రిటిష్ పాలకులు తమను వ్యతిరేకించేవారిని దారికి తెచ్చుకోడానికి 1870లో ఈ చట్టాన్ని తీసుకు వచ్చారు. ప్రజాస్వామ్యమని చెప్పుకుంటూ ఆ మేరకు ప్రజలకు వివిధ స్వేచ్ఛలు, హక్కులు కల్పిస్తూ సమగ్ర రాజ్యాంగాన్ని రచించుకున్న తర్వాత దాని ప్రకారం ప్రభుత్వాలు నడచుకోడమనేది అత్యంత అరుదైన విషయంగా మారిపోయింది.
ప్రజల ఓటుతో ప్రజాస్వామ్య రాజ్యాంగం ప్రసాదించిన అధికార పీఠం ఎక్కిన తర్వాత పాలకులు విశాల జనహిత కర్తవ్యాన్ని విస్మరించి స్వార్థపర, అధిక లాభార్జన దృష్టి గల సంపన్న వర్గాల సేవలో తరిస్తుండడం వల్లనే ఇటువంటి చట్టాలను ప్రయోగించవలసిన అవసరం వారికి కలుగుతున్నది. సాధారణ ప్రజలకు రక్షణగా ఉంటూ వచ్చిన సంక్షేమ కవచానికి తూట్లు పొడిచి జనం కష్టార్జితాన్ని పన్నుల రూపంలో తాము తన్నుకుపోతూ ప్రైవేటు వ్యాపారులు అధిక ధరల ద్వారా దోచుకోడానికి మార్గాలు కల్పిస్తున్న పాలకుల పాలన సహజంగానే నిరంకుశంగా తయారవుతుంది. ఈ అన్యాయాలను ఎదిరించి తమ కనీస జీవన సౌకర్యాలను కాపాడుకోడానికి నిరసన కంఠం వినిపించే ప్రజలను, వారి తరపున ప్రశ్నించేవారిని నిర్బంధించి వారి నోరు మూయడం తప్పనిసరి అవుతుంది.
అలాగే దేశంలోని మారుమూల ఆదివాసీ ప్రాంతాల్లోని విలువైన ఖనిజాలను ప్రైవేటు బడా పెట్టుబడిదార్లకు దోచిపెట్టే ప్రయత్నాలను అక్కడి అమాయక జనం అడ్డుకునేటప్పుడు వారిని, వారిని ప్రోత్సహిస్తున్న వారిని హింసావాదులుగా ముద్ర వేసి రాజద్రోహ సెక్షన్ను, ఉపా వంటి చట్టాలను ప్రయోగించడం పాలకులకు తప్పనిసరి అవుతున్నది. అందుచేత ఒక చట్టాన్ని తొలగిస్తే దాని మాదిరి మరో క్రూర శాసనాన్ని తీసుకురాడానికి పాలకులు వెనుకాడరు. అయితే భారత ప్రధాన న్యాయమూర్తి ప్రపంచానికంతటికీ వినిపించేలా ఇంత బిగ్గరగా రాజద్రోహ చట్టం కొనసాగింపును నిరసించినప్పుడు దాని మంచి ప్రభావం ఎంతో కొంత ఉండక మానదు. ఇందుకు జస్టిస్ ఎన్వి రమణను అభినందించాలి.