Monday, December 23, 2024

రాజద్రోహ చట్టం రద్దుకు తొందరవద్దు మేమే సమీక్షిస్తాం..

- Advertisement -
- Advertisement -

Sedition law will be re-examined

దేశద్రోహచట్టం సమీక్షకు సిద్ధం
సుప్రీం ధర్మాసనానికి అఫిడవిట్
మోడీ ఆజాదీకా అమృతోత్సవ్ స్ఫూర్తిగా వివరణ

న్యూఢిల్లీ : కాలం చెల్లిన దేశద్రోహ చట్టంపై రెండు మూడురోజుల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంది. చట్టాన్ని సమీక్షించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. సోమవారం కేంద్రం సుప్రీంకోర్టుకు సంబంధిత వైఖరిపై సమగ్ర అఫిడవిట్ సమర్పించింది. రెండు రోజుల క్రితం దేశద్రోహ చట్టాన్ని కేంద్రం సమర్ధించుకుంది. ఈ వలసపాలకుల చట్టంలోని నిబంధనలను మార్చాల్సిన అవసరం కానీ, చట్టాన్ని రద్దు చేయాల్సిన అగత్యం కానీ లేదని పేర్కొంటూ మరో అడుగు ముందుకేసి చట్టం రద్దుకు దాఖలైన పిటిషన్లన్నింటిని కొట్టివేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది. అయితే ఇప్పుడు ఈ వైఖరి నుంచి ఇప్పుడు కేంద్రం వెనకకు మళ్లి ఫీచేముడ్ బాటపట్టింది.ప్రధాని నరేంద్ర మోడీ విజన్, దేశ స్వాతంత్య్ర ఘట్టం ఆజాదీ కా అమృత్ మహోత్సవం స్ఫూర్తితో ఈ నేపథ్యంలో ఈ చట్టం రివ్యూకు కేంద్రం సంకల్పించింది. ఈ విషయాన్ని అఫడివిట్ రూపంలో ఇప్పుడు న్యాయస్థానం దృష్టికి తద్వారా దేశ ప్రజల ముందుకు తీసుకువస్తున్నామని తెలిపింది. చట్టంలోని 124 ఏ అధికరణ సంబంధిత నిబంధనలు రూల్స్‌ను తిరిగి పరిశీలించేందుకు, వీటిపై సమీక్షించుకుని ఓ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ మేరకు కేంద్రం ఓ నిర్ణయం తీసుకుందని ఈ వివరణాత్మక పత్రంలో తెలిపారు.

ఎడిటర్స్ గిల్డ్ పిటిషన్లపై సమయం వృధా చేయవద్దు

ఇప్పుడు ఈ చట్టం సమీక్షకు నిర్ణయం తీసుకున్నందున దీనిని ఓ సాధికారిక ఫోరం ఆధ్వర్యంలో పూర్తి చేసేందుకు సిద్ధపడిన దశలో సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలపై కూలంకుషంగా నిర్ణయం తీసుకోవల్సి ఉందని కేంద్రం తెలిపింది. చట్టం రద్దుకు ఎడిటర్స్ గిల్డ్ , టిఎంసి ఎంపి మహూవా మొయిత్రా ఇతరులు దాఖలు చేసుకుని ఉన్న పిటిషన్ల గురించి సమయం వృధా చేయాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని సంబంధిత ధర్మాసనం దృష్టిలో పెట్టుకోవాలని కేంద్రం కోరింది. అసలు ఈ దేశద్రోహ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేసే అవకాశం ఎవరికి ఇవ్వరాదు. పైగా సుప్రీంకోర్టు ధర్మాసనం దీనిని విచారించే అధికారం కూడా లేదని తాము అభిప్రాయపడుతున్నట్లు గత వారం సుప్రీంకోర్టులో తెలిపింది. అయితే దీనికి విరుద్ధంగా ఇప్పుడు చట్టం సమీక్షకు దిగుతామని, ఇందుకు నేపథ్యంగా స్వాతంత్య్ర 75 ఏండ్ల ఘట్టాన్ని జోడించడం వంటి అంశాలు కీలకం అయ్యాయి.

చట్ట దుర్వినియోగంపై సుప్రీం ఆందోళన

తరాల నాటి దేశద్రోహ చట్టం ఇప్పుడు అవసరమా అనే ప్రశ్న వస్తోందని సుప్రీంకోర్టు గత ఏడాది జులైలో ప్రశ్నించింది. దేశ ద్రోహ చట్టంలోని అంశాల ఆధారంగా నిబంధనల దుర్వినియోగం జరుగుతోంది. దీనిపై తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నామని , చట్టం ఎందుకు రద్దు చేయడం లేదని కేంద్రానికి సూటి ప్రశ్నలు అప్పట్లో వెలువరించింది. మహాత్మా గాంధీ వంటి స్వాతంత్య్ర ప్రతీకల అభీష్టాలను తోసిరాజంటూ అప్పటి బ్రిటిష్ పాలకులు తీసుకువచ్చిన చట్టం అవసరం ఇప్పుడు ఉందా? ఎందుకు దీనిపై మౌనం అని సుప్రీంకోర్టు ఆదశలో కేంద్రానికి చురకలు పెట్టింది.

కాలపరీక్షకు నిలిచిందిగా ః కేంద్రం మొన్నటి మాట

శనివారం దేశద్రోహ చట్టం పిటిషన్ల విచారణ దశలో కేంద్రం పలు విధాలుగా చట్టానికి మద్దతు తెలిపింది. 1962 నాటి సుప్రీంకోర్టు తీర్పులో చట్టాన్ని సమర్థించిందని , చెల్లుబాటు చెల్లనేరుతుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని, దీనిని ఇప్పుడు తిరిగి సుప్రీంకోర్టే ఎందుకు విచారిస్తుందని కేంద్రం ప్రశ్నించింది. ఆరు దశాబ్దాలుగా చట్టం కాలపరీక్షకు నిలిచిందని, దీనిని దుర్వినియోగపరుస్తున్నారనే ఆరోపణలతో దీని రద్దుకు దిగాలనడం కుదరదని సమీక్షించుకునే అవకాశం లేదని తెలిపింది. అయితే రెండు రోజుల వ్యవధిలోనే చట్టం సమీక్షకు కేంద్రం ముందుకువచ్చింది. పిటిషన్లను తోసిపుచ్చాలనే కేంద్రం వాదనను పక్కకు పెడుతూ శనివారం ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పిటిషన్లపై విచారణను సోమవారం నుంచి వేగిరపరుస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం అఫిడవిట్ దాఖలు అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News