మనతెలంగాణ/హైదరాబాద్: ప్రతిష్టాత్మక ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ తలపెట్టిన సీడ్ గణేశ్ విగ్రహాలను ఎల్బీ స్టేడియంలో ఆబ్కారీ, టూరిజం, కల్చర్, క్రీడలు, యువజన సర్వీసులు, పురావస్తు శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పంపిణీ చేశారు. సుమారుగా 1001 విత్తన గణేష్ విగ్రహాలను మంత్రి చేతుల మీదుగా అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారన్నారు. క్రీడాకారులను, కోచ్‌లకు ప్రోత్సాహకాలను అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం, వాతావరణ సమతుల్యత సాధించాలన్న లక్ష్యం తో సిఎం కెసిఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. అందులో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎంపి సంతోష్ కుమార్ సీడ్ గణపతులను తయారు చేసి అందరికీ అందించడం, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం అభినందనీయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఇషా సింగ్ తదితరులు పాల్గొన్నారు.