మన తెలంగాణ/హైదరాబాద్:వానాకాలం -2025 పంటకాలానికి రైతాంగానికి కావల్సిన విత్తనాలు అందుబాటులో ఉంచే విధంగా కార్యాచరణను సిద్దం చేసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో వానాకాలం పంటలకు విత్తనాల అవసరం, లభ్యత, వాటి సరఫరాపై రాష్ట్రస్థాయి వ్యవసాయాధికారులు, విత్తన కం పెనీల ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. విత్తనోత్పత్తి రైతుల ప్రయోజనాలు కాపాడేవిధంగా అధికారులు చ ర్య లు తీసుకోవాలని సూచించారు. అన్ని పంటల విత్తనాలను ముందస్తుగానే రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాణ్యమైన విత్తనాల ఎంపిక విషయంలో, విత్తనాలకొనుగోళ్ళలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వమించాలని సూచించారు.
132 లక్షల ఎకరాల్లో పంటసాగు
వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి మాట్లాడుతు వానాకాలం -2025 లో 66.80 లక్షల ఎకరాలలో వరి, 6 లక్షల ఎకరాలలో మొక్కజొన్న, 50 లక్షల ఎకరాలలో పత్తి, 9 లక్షల ఎకరాలలో సోయా చిక్కుడు సాగు చేసే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే అంచనా వేసినట్లు తెలిపారు. అందుకు తగ్గట్లుగా 16.70 లక్షల క్వింటాళ్ళ వరి విత్తనాలు, 0.48 లక్షల మొక్కజొన్న, 89 లక్షల ప్రత్తి ప్యాకేట్లు, 1.35 లక్షల క్వింటాళ్ళ సోయాచిక్కుడు విత్తనాలు అవసరమవుతాయన్నారు. వరిలో సన్న బియ్యం సాగు ఈ సారి ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున సన్నరకాల విత్తనాలను అధికమొత్తంలో అందుబాటులో ఉంచడానికి ఏర్పాట్లు చేశామని డైరెక్టర్ గోపి చెప్పారు. ప్రత్తికి సంబంధించి 2.4 కోట్ల పత్తి విత్తన ప్యాకేట్లు ఇప్పటికే అందుబాటులో ఉంచామని, జిల్లాల వారీగా, ప్రాంతాల వారిగా డిమాండ్ ఉన్న పత్తి రకాలను అవసరం కంటే అధికమొత్తంలో తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచాలని సంబందిత కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశామని వివరించారు.
పచ్చిరొట్టే ఏర్పాట్లు
పచ్చిరొట్టే విత్తనాలకు సంబంధించి ఈ వానాకాలం పంటకాలం కంటే ముందుగా ఎప్రిల్ నెలలోనే విత్తనాలు తెప్పించి అందుబాటులో ఉంచడానికి వీలుగా ఇప్పటికే తెలంగాణ సీడ్స్ సంస్థకు 1.94 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్టే విత్తనాల సరఫరాకు ప్రతిపాదనలు పంపించామన్నారు. పచ్చిరొట్టే సరఫరాలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా పకడ్బంది చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రత్యేక దృష్టి పెట్టండి
దీంతో మంత్రి తుమ్మల అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ గత అనుభవాల దృష్ట్యా డిమాండ్ ఉన్న రకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వరిపంట సాగుచేస్తున్న రైతుల నుంచి బెరుకులు ఎక్కువగా రావడం, తొందరగా కంకి వెయ్యడం లాంటి ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిని సరిదిద్ధి, నాణ్యమైన విత్తనాన్ని రైతులకు అందుబాటులో ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
కల్తీ విత్తనాలపై కన్నెయ్యండి
ముఖ్యంగా విత్తనోత్పత్తి చేస్తున్న రైతులు నష్టపోయిన సందర్భాలు ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయని మంత్రి తుమ్మల అధికారులను హెచ్చించారు. విత్తన కంపెనీలకు రైతులకు మధ్య వారధిగా ఉన్న ఆర్గనైజర్లలో కొంతమంది రైతులకు దక్కాల్సిన ధరను కానీ, చెల్లించాల్సిన డబ్బుల విషయంలో కానీ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వెంటనే సీడ్ మెన్ అసోసియేషన్, కంపెనీ ప్రతినిధులు సమావేశమై విత్తనోత్పత్తి ఒప్పందాలు కంపెనీలకు, రైతులకు మధ్య కుదిరేలా, పండించిన విత్తనానికి చెల్లించే మొత్తం కానీ, సరిగ్గా పంటరాని సందర్భంలో చెల్లించే పరిహారం కానీ రైతులకే చెల్లించే విధంగా చూడాలని నిర్దేశించారు. ఇకముందు ఎక్కడైనా ఇటువంటి ఫిర్యాదులు వస్తే ప్రభుత్వం ఆయా కంపెనీల పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి హెచ్చరించారు.
తరచూ తనిఖీలు చేయండి
అదేవిధంగా వ్యవసాయాధికారులు వారివారి పరిధిలో ఉన్న విత్తన కంపెనీలను తరుచూ పర్యవేక్షించి తనిఖీలు చేయాలని మంత్రి అధికారులను కోరారు. రైతులకు నాణ్యమైన విత్తనం అందేలా చూడాలని, అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. రైతులకు విత్తన ఎంపికలో, కొనుగోళ్లలో పాటించాల్సిన విషయాలపై అవగాహన కార్యక్రమాలు రైతు వేదికలలో చేపట్టాల్సిందిగా, పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటు గ్రామాలలో లేబుల్ లేకుండా విత్తనాలు అమ్మే వారిని నియంత్రించే విధంగా చూడాలని కోరారు.
కూరగాయల విస్తీర్ణం పెరగాలి
ఇదే సందర్భంలో రాష్ట్రంలో కూరగాయల విత్తనాల లభ్యతపై, దిగుబడులపై కూడా కంపెనీ ప్రతినిధులతో ఆరా తీసి, కూరగాయల విస్తీర్ణాన్ని పెంచడానికి కృషిచేయాలని మంత్రి తుమ్మల సూచించారు. సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరి రఘునందన్ రావు, టి.జి సీడ్స్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి, సీడ్స్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, సీడ్ మెన్ అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.