Saturday, November 23, 2024

విద్వేష విత్తనాలు!

- Advertisement -
- Advertisement -

ప్రతి పంట సీజన్‌కీ విత్తనాలు చల్లుతారు, ఏ పంట కావలిస్తే దాని విత్తనాలు వేస్తాము. అలాగే రాజకీయ పార్టీలు ఎన్నికల సీజన్‌లో ఓట్ల పంటతో అధికారాన్ని చేజిక్కించుకోడానికి తగిన విత్తనాలు చల్లే విధానం ఒకటి రూపొందిందని భావించవలసి వస్తున్నది. చేసినది చెప్పుకోడం, ప్రజలకు మరింత చేస్తామని ఆశ కల్పించడం ఒక తీరు. కాని భిన్న వర్గాల ప్రజల మధ్య విద్వేషాన్ని పండించే విత్తనాలు చల్లడం, తద్వారా మెజారిటీ ఓట్లను కొల్లగొట్టే కుట్రకు పాల్పడడం బొత్తిగా మానవీయం కాదు. ఇది ఈ విత్తనాలు చల్లే వారికి తాత్కాలికంగా ఆశించిన ఫలితాలను ఇవ్వవచ్చు కాని, జాతికి, దేశానికి శాశ్వత హాని చేస్తుంది. మహారాష్ట్రలో బుధవారం నాడు చోటు చేసుకొన్న ఘటనలు కొన్నింటి వెనుక ఇటువంటి కుట్ర దాగి వున్నదని అనుమానించడానికి అవకాశం కలుగుతున్నది.

ఆ రాష్ట్రంలో కొల్హాపూర్ నగరంలో బుధవారం నాడు వున్నట్టుండి ఉద్రిక్తత నెలకొన్నది. హిందుత్వ అనుకూల శక్తులు నిరసన ప్రదర్శనలు తీసి రాళ్ళు రువ్వడం ప్రారంభించాయి. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును, 18వ శతాబ్ది నాటి మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్‌ను పొగుడుతూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టింగుల పట్ల వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దానితో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగి ఒక వ్యక్తి దుర్మరణానికి దారి తీశాయి. ‘మా మరాఠా నేల మీద మొఘల్ నాయకులను ప్రశంసించడాన్ని మేము సహించం, హిందూ సమాజాన్ని కాపాడుకొంటాం. అందుకు కత్తులు దూయడానికి కూడా వెనుకాడం’ అనే నినాదాలు కూడా వినిపించినట్టు వార్తలు చెబుతున్నాయి. సకాలంలో పోలీసులు రంగంలోకి దిగి దాదాపు 40 మందిని అరెస్టు చేసినట్టు వార్తలు చెబుతున్నాయి. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకొంటామని ప్రభుత్వం ప్రకటించింది. విషయాన్ని తరచి చూస్తే మత దృష్టి గల ఉన్మాదులే ఈ పరిణామానికి కారణమని స్పష్టపడుతున్నది.

ఏ సమాజాన్నైనా కాపాడడానికి ప్రభుత్వం వుంటుంది, దాని పోలీసులుంటారు. ప్రజలు భిన్న వర్గాలుగా చీలిపోయి తమ తమ సమాజాలను కాపాడుకుంటామంటూ అవతలి వర్గంపై పళ్ళు పటపటా కొరకవలసిన అవసరం లేదు. అందులోనూ అన్ని మత వర్గాల మధ్య సహజీవనాన్ని కాపాడడం ధర్మంగా అభయ హస్తం చాస్తున్న రాజ్యాంగం, దాని పాలనా యంత్రాంగం వున్న చోట ఆ బాధ్యతను వేరెవ్వరో తీసుకోవలసిన పనే వుండదు. అయితే మత విద్వేషాలే ఊపిరిగా బతికే శక్తులు అధికారంలో వున్న చోటనే రాజ్యాంగ ధర్మానికి తూట్లు పడుతున్నాయి. మెజారిటీ, మైనారిటీ మధ్య లేనిపోని విద్వేషాలు, ఆవేశకావేషాలు రగులుతున్నాయి. ఇది జాతికి చెప్పనలవికాని ముప్పుగా పరిణమించింది. ఇటువంటి కుతంత్రాలకు పాల్పడి కర్ణాటకలో హద్దులు మీరి మైనారిటీలపై విద్వేషాన్ని రగిలించినందు వల్లనే అక్కడ భారతీయ జనతా పార్టీ చిత్తుగా ఓడిపోయింది.

ఆ గుణపాఠంతోనైనా ఈ వర్గం, ఆ వర్గం అనే తేడా లేకుండా ప్రజలందరికీ మేలు చేసే పాలన అందివ్వడం ద్వారా వారి అభిమానాన్ని చూరగొని పది కాలాల పాటు అధికారంలో కొనసాగుదామనే దృష్టి కమలనాథుల్లో కలగకపోడం దురదృష్టకరం. ఈ అల్లర్లకు పథక రచన ముందుగానే జరిగిందని మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గిరీశ్ మహాజన్ విలేకరులతో అన్నారు. ఉద్ధవ్ థాక్రే శివసేనకు చెందిన మాజీ పార్లమెంటు సభ్యులు చంద్రకాంత్ కైరే మొన్న సోమవారం నాడు మాట్లాడుతూ ముస్లిం ఓట్లు పూర్వపు అధికార కూటమి మహావికాస్ అఘాడి వైపు మళ్ళకుండా చేయడానికి అల్లర్లను రెచ్చగొడుతున్నారని అభిప్రాయపడ్డారు. తాము అధికారంలో వున్నప్పుడు అల్లర్లనేవి జరగలేదని, ఏక్‌నాథ్ షిండే దేవేంద్ర ఫడ్నవీస్ ఐక్య సంఘటన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అవి చోటు చేసుకొంటున్నాయని ఆయన అన్నారు.

బుధవారం నాటి ప్రదర్శనల్లో పాల్గొన్న కొంత మంది నిరసనకారులు ఇండియాలో హిందువులు సురక్షితంగా లేరంటూ లౌజిహాద్‌ను, కేరళ స్టోరీ సినిమాను ప్రస్తావించడం గమనించవలసిన విషయం. ఎన్నడూ లేనిది కేరళ స్టోరీ వంటి సినిమాల అవసరం ఎందుకు కలిగింది, ఎవరికి కలిగింది అనేవి లోతుగా పరిశీలన చేసి సమాధానాలు తెలుసుకోవలసిన ప్రశ్నలు. మెజారిటీ, మైనారిటీలు కలిసి వుండడం అనేది తప్పనిసరి, సమాజ శాంతికి అత్యవసరం. ఈ రెండు వర్గాల మధ్య ఎవరు, ఏ దుష్ప్రయోజనం కోసం చిచ్చు రగిలించినా అది వీరు వారు అనకుండా అన్ని వర్గాల వారికీ ముప్పు కలిగిస్తుంది. భిన్న వర్గాల ఘర్షణలో మనం కోరుకొన్న వర్గం వారే నష్టపోవాలని అనుకుంటే అయ్యేది కాదు. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చిన తర్వాత చెలరేగిన హింసలో అందరి రక్తమూ పారింది. అన్ని వర్గాల వారు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా దేశం, జాతి ఘోర పరాజయానికి గురయ్యాయి. అటువంటి విషాదం కోరుకొనే వారే ఇటువంటి చిచ్చులను రగిలిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News