కేంద్రం హామీ ఇచ్చిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలేవీ..?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగి నైతిక హక్కు బిజెపికి లేదు
టిఆర్‌ఎస్ బిజెపి దొందూ దొందే : కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
మన తెలంగాణ/హైదరాబాద్:26 సంజయ్‌కి హితవు పలికారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 11 సంవత్సరాలుగా యువకులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కనీసం జిల్లాకు 200 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని అన్నారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సీతక్క మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులకు, యువకులకు జవాబు చెప్పుకోక మత రాజకీయాలకు బండి సంజయ్ పాల్పడుతున్నారని ఆరోపించారు.
చెప్పుకోవడానికి అభివృద్ధి లేదు, సబ్జెక్టు అంతకన్నా లేదని అన్నారు. అందుకే బండి సంజయ్ నోరు తెరిస్తే హిందూస్తాన్, పాకిస్తాన్, హిందూ, ముస్లిం తప్ప మరో మాట లేదని అన్నారు. పట్టభద్రులకు మీరేం చేశారని సూటిగా బండి సంజయ్‌ని ప్రశ్నిస్తున్నానని చెబుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు బిజెపికి లేదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మి, ప్రైవేటీకరణ పేరుతో ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారని బిజెపిపై విమర్శలు గుప్పించారు.
దేవుని పేరుతో రాజకీయాలు చేసే బిజెపి దేవునికి వినియోగించే అగర్బత్తిల మీద కూడా జిఎస్టి వేసిందని సీతక్క విమర్శించారు. ఉన్నత విద్య మీద 18 శాతం జిఎస్టి విధిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి బిజెపి తరఫున ఓటు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. తెలంగాణ విభజన హామీలు అమలు కాలేదని తెలిపారు. ఎన్నికలప్పుడే హిందూ ముస్లిం అని రెచ్చగొడతారని బండి సంజయ్‌పై విమర్శల దాడి చేశారు. భారత దేశాన్ని పాకిస్తాన్‌తో పోల్చి కించపరచడం తప్ప మీరు దేశానికి చేసింది ఏమీ లేదని అన్నారు. దమ్ముంటే అభివృద్ధి ప్రాతిపదికన ఎన్నికల్లోకి రావాలని మంత్రి సీతక్క సవాల్ విసిరారు.
గిరిజన వర్శిటీ ఇంకా మొదలే కాలేదు
గిరిజన యూనివర్సిటీ పనులు కూడా మొదలుపెట్టలేనీ అసమర్థ కేంద్ర ప్రభుత్వమని మంత్రి సీతక్క దుయ్యబట్టారు. మీరు చేసింది శూన్యమని బిజెపిపై ధ్వజమెత్తారు. పట్టభద్రులారా ఆలోచించండి విద్యా వేత్త నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఏడాదిలోనే 54 వేల ఉద్యోగాలు ఇచ్చామని, నరేందర్ రెడ్డి ని గెలిపించి పనిచేసే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. దేశ గౌరవాన్ని తగ్గిస్తున్న బండి సంజయ్‌ను బిజెపి పెద్దలు నియంత్రించాలని మంత్రి సూచించారు.
యువతను మత కొట్లాట వైపు మళ్లించి కేసులు నమోదు చేయించడమే బిజెపి రాజకీయమని మండిపడ్డారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారతీయులంతా నా సోదరులే అన్న మీరు, భారత రాజ్యాంగాన్ని కాపాడతానని చెప్పిన మీరు, అధికారం కోసం విద్వేష ప్రసంగాల అవసరమా అని సంజయ్‌ను ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ బిజెపి దొందూ దొందేనని వ్యాఖ్యానించారు. జటిలమైన ఎన్నో సమస్యలను పరిష్కరించిన ప్రభుత్వం తమ ప్రజా ప్రభుత్వమని అన్నారు. భారతదేశంలో యుద్ధ వాతావరణం సృష్టించే ప్రయత్నం మానుకోవాలని సూచించారు.