సమతామూర్తితో వ్యాపారమా?
చిన్నజీయర్‌పై సీతక్క ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్: ములుగు ఎంఎల్‌ఎ సీతక్క చినజీయర్ స్వామిపై మండిపడ్డారు. సమ్మక్క, సారలమ్మలపై ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆమె హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ చిన జీయర్ స్వామిపై ఆగ్రహం చెందారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ మీద అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహించారు. మా తల్లులది వ్యాపారమా? లేక సమతామూర్తి విగ్రహం ఏర్పాటుతో మీరు చేస్తున్నదని వ్యాపారమా? అంటూ నిలదీశారు.
తమ దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదని చెప్పారు. అదే.. 120 కిలోల బంగారం గల సమతామూర్తి విగ్రహం చూడటానికి మీరు రూ.150 టికెట్ పెట్టారని విమర్శించారు. ఈ రెండింటినీ పోలుస్తూ ఎవరిది వ్యాపారం? అంటూ అడిగారు. ‘మీది బిజినెస్.. సమ్మక్క సారలమ్మ తల్లి దగ్గర ఇలాంటి వ్యాపారం జరగదు’ అంటూ సీతక్క మండిపడ్డారు. అదే విధంగా ఆమె చిన జీయర్ స్వామిని నేరుగా విమర్శించారు. లక్ష రూపాయలు తీసుకోకుండా ఎవరైనా పేద వారికి ఇంటికి వెళ్లారా? అంటూ అడిగారు. చినజీయర్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ స్వామిగా చినజీయర్‌ను పేర్కొన్నారు. ఈ చిన జీయర్ స్వామికి తగిన బుద్ధి చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు.