క్వాలిటీ కంట్రోల్ టీమ్‌లతో విచారణ చేపట్టండి
బాధ్యులైన అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తాం
సమీక్షలో మంత్రి సీతక్క అధికారులపై ఆగ్రహం
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామీణ రహదారి పనుల్లో కొన్ని నాసిరకంగా చేపట్టారని సంబంధిత అధికారులపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి పనులకు బిల్లులు ఎలా మంజూరు చేశారని ప్రశ్నించారు. గ్రామీణ రహదారి పనుల పురోగతిపై మంత్రి సీతక్క సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, డైరెక్టర్ సృజన, ఇఎన్‌సి కనక రత్నం తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. కొన్ని చోట్ల సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించడం లేదన్న వార్త కథనాలను ప్రస్తావించిన మంత్రి సీతక్క నాసిరకం పనుల పట్ల మంత్రి సీతక్క విచారం వ్యక్తం చేశారు.
నాసిరకం పనులు జరిగిన చోట బిల్లులు ఎలా చెల్లించారు, క్వాలిటీ సర్టిఫికెట్లు ఎలా మంజూరు చేశారని అధికారులను ప్రశ్నించారు. క్వాలిటీ కంట్రోల్ టీమ్‌లను తక్షణమే ఆయా ప్రాంతాలకు పంపాలని ఆదేశించారు. గ్రామీణ రహదారుల నిర్మాణంలో నాణ్యత పై రాజీ పడేది లేదని మంత్రి స్పష్టం చేశారు. నాణ్యత లోపాలపై నివేదికలు తెప్పించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంట్రాక్టర్లు, ఏ స్థాయిలో ఉన్న వారిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. నాసిరకం పనులు జరిగిన చోట్ల సస్పెన్షన్లు తప్పవని కూడా హెచ్చరించారు.
మహిళా ప్రాంగణాలను నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా మార్చాలి: మంత్రి సీతక్క
జిల్లా కేంద్రాల్లో ఉన్న మహిళా ప్రాంగణాలను నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా మార్చాలని మంత్రి సీతక్క సూచించారు. మధుర నగర్‌లోని తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయంలో మహిళా కార్పొరేషన్ పై మంత్రి సీతక్క మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మహిళ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ, మహిళా కార్పొరేషన్ జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఒక్కో మహిళా ప్రాంగణాన్ని ఒక్కో రంగంలో శిక్షణకు ఉపయోగించాలని సూచించారు.
మూస పద్ధతిలో కాకుండా అవకాశాలు, ప్రజల అవసరాలకు అనుగుణంగా శిక్షణ కేంద్రాలను తీర్చిదిద్దాలని వారికి మంత్రి దిశానిర్దేశం చేశారు. మహిళా ప్రాంగణాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని సూచించారు. మహిళా స్వయం సహాయక బృందాలతో సమన్వయం చేసుకొని మహిళా కార్పొరేషన్ అధికారులు పనిచేయాలని అన్నారు. మహిళా కార్పొరేషన్, మహిళా సంఘాలు కలిసి పని చేస్తే కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలన్న లక్షం సాధ్యపడుతుందని అన్నారు. మహిళా ప్రాంగణ భూముల్లో మహిళా పెట్రోల్ బంకులు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా ప్రాంగణాల్లో మహిళలకు ఆటో డ్రైవింగ్, కార్ డ్రైవింగ్ సెంటర్లు నెలకొల్పి ఉచితంగా శిక్షణ ఇస్తామని వివరించారు.
ఇప్పటికే 400 మందికి డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించాం: బండ్రు శోభారాణి
మహిళలకు ఉపాధి కల్పించేలా, ఆర్థిక చేయూత అందించేలా తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ పని చేస్తుందని మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి తెలిపారు. కూకట్‌పల్లి ప్రాంగణంలో 400 మందికి ఇప్పటికే డ్రైవింగ్ శిక్షణ ఇప్పించామని ఆమె పేర్కొన్నారు. మరింత సమర్థవంతంగా మహిళా ప్రాంగణాలను వినియోగించే కార్యాచరణను అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రాలకు డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను విస్తరించే ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు. మహిళా ప్రాంగణంలో శిక్షణ తీసుకున్న మహిళా సంఘాలకు ప్రభుత్వo ఉపాధి మార్గాలను కల్పిస్తుందని తెలిపారు.
నిజామాబాద్ మహిళా ప్రాంగణంలో నాణ్యమైన పసుపు, వరంగల్ మండలంలో నాణ్యమైన కారం ఉత్పత్తి అవుతుందని అన్నారు. జిల్లా కేంద్రాల్లో మహిళా సూపర్ మార్కెట్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. వరంగల్ మహిళా ప్రాంగణంలో పండిన అరటికాయ గెలను, అరటి మొక్కలను మంత్రి సీతక్కకి బహుమానంగా ఇచ్చిన మహిళా కార్పొరేషన్ డిస్టిక్ మేనేజర్లు మహిళా కార్పొరేషన్ అధికారులు, జిల్లా అధికారులు మాట్లాడుతూ ఎంతో కాలం తర్వాత మంత్రితో సమావేశం కావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సెర్ప్ సీఈఓ దివ్య దేవరజన్, మహిళా కార్పొరేషన్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.