Monday, January 20, 2025

తెలుగు రాజకీయాల్లో సీతక్క ఓ సంచలనం

- Advertisement -
- Advertisement -

ధనసరి అనసూయ అంటే తెలియకపోవచ్చేమో కానీ సీతక్క అంటే తెలియని వారు ఉండరు. తెలుగు రాజకీయాల్లో సీతక్క ఓ సంచలనంగా చెప్పవచ్చు. 15 ఏళ్లకుపైగా మావోయిస్టుగా అజ్ఞాతంలో ఉంటూ పోరాటాలు చేశారు. తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిపోయి రాజకీయ జీవితం ప్రారంభించారు. ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధిస్తూ వస్తున్నారు. నాలుగు సార్లు పోటీ చేస్తే మూడుసార్లు విజయం సాధించారు. మొదట్లో సీతక్క జననాట్య మండలి ద్వారా గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యవంతులను చేసేవాళ్లు.

జరుగుతున్న అన్యాయంపై నాటకాల ద్వార ప్రజలకు తెలియ జెప్పేవారు. అప్పటి భూస్వాముల ఆగడాలను ఎదుర్కోవడానికి సాయుధ ప్రతిఘటన తప్ప మరొక మార్గం లేదని భావించి నక్సల్స్‌లో చేరారు. సీతక్క 1988లో నక్సల్‌లో చేరినప్పుడు సీతక్కా 10 వ తరగతి చదువుతున్న విద్యార్థి. ఫూలన్ దేవి రచనల నుంచి ప్రేరణ పొంది, ఆర్థిక దోపిడీ కులవాద వివక్షపై కోపంతో నక్సల్స్‌లో చేరారు. జనశక్తి (సీపీఐ) (ఎంఎల్) పార్టీలో చేరి పోరాటం చేశారు. చాలా సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి సాయుధ పోరాటంలో మహిళా నక్సలైట్‌గా, దళం లీడర్‌గా ప్రధాన భూమిక వహించారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిసిపోయారు. 2001లో హైదరాబాద్లో న్యాయవాదిగా మారడానికి ఎల్.ఎల్.బి చదివారు.

చట్టం అధ్యయనం చేసిన తర్వాతే ఆమెకు ప్రజా విధానం, పాలనపై ఆసక్తి ఏర్పడింది. స్థానికంగా మంచి పేరు ఉన్నందున చంద్రబాబు ఆమెకు టికెట్ ఇచ్చారు. దీంతో సీతక్క రాజకీయ రంగప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి టిడిపి తరఫున పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేసి వీరయ్యపై గెలిచారు. 2014లోమూడోసారి టిడిపి అభ్యర్థినిగా బరిలో నిలిచి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయారు. తర్వాత టిడిపికి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018, 2023లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు మంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News