Monday, December 23, 2024

నాడు నక్సలైటు… నేడు మంత్రివర్గంలో చోటు!

- Advertisement -
- Advertisement -

దనసరి అనసూయ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ సీతక్క పేరు చెబితే తెలియనివారు ఉండరు. గురువారం ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రులలో సీతక్క కూడా ఒకరు. ఒకప్పుడు కరడుగట్టిన నక్సలైట్ గా రాజ్య హింసపై తుపాకీ ఎక్కుపెట్టారామె. నమ్మిన సిద్ధాంతం కోసం పదిహేనేళ్లకు పైగా అడవుల్లో అజ్ఞాత జీవితం గడిపారు. 1971 జూలై 9న జన్మించిన సీతక్క  అసలు పేరు దనసరి అనసూయ. గద్దర్, విమలక్క వంటివారి ఉద్యమ గీతాలకు ప్రభావితురాలై, చిన్న వయసులోనే జననాట్య మండలిలో చేరారు. పద్నాలుగేళ్ల వయసులో పదవ తరగతి చదువుతూ, తుపాకీ చేతబట్టి నక్సలైట్లలో కలసిపోయారు. అది మొదలు జనశక్తి (సిపిఐఎంఎల్)లో కీలక నేతగా ఎదిగారు. అయితే చదువును మాత్రం ఆపలేదు. ఒక దశలో దళ సభ్యులంతా  పోలీసులకు పట్టుబడ్డారు. వారిలో  సీతక్క కూడా ఉన్నారు. అయినా ఆమె జైలులో ఉంటూనే పదవ తరగతి పూర్తి చేశారు. దళ నాయకురాలిగా అనేక నక్సల్ ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఏళ్ల తరబడి అజ్ఞాత జీవితం గడిపారు. అప్పట్లో సీతక్క కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు.

సీతక్క నక్సలైట్లలోనే ఉన్న తన బావ శ్రీరాముడిని నక్సలైట్ ను పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లయ్యారు. ఆ తర్వాత 1996లో నక్సలిజానికి స్వస్తి చెప్పి, జన జీవన స్రవంతిలోకి వచ్చారు. అనంతరం ఐటీడిఏలో నెల జీతానికి పనిచేస్తూ చదువు కొనసాగించారు. అదే క్రమంలో లా డిగ్రీ కూడా తీసుకున్నారు. అంతేకాదు, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గొత్తి కోయలపై పరిశోధన చేసి డాక్టరేట్ కూడా తీసుకున్నారు.

సీతక్క గురించి తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు ములుగునుంచి టికెట్ ఇచ్చారు. కానీ ఆమె కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓడిపోయారు. 2009లో టిడిపీ టికెట్ పైనే పోటీ చేసి విజయం సాధించారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓటమి చవిచూశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ములుగు నియోజకవర్గంనుంచి బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై 28వేల ఓట్లతో ఘన విజయం సాధించారు.

నక్సలైట్ గా ఉంటూ బీదాబిక్కీ కోసం విశేషంగా కృషి చేసిన సీతక్కది ఇప్పటికీ అదే తత్వం. ప్రజలకు ఏ సమస్య ఎదురైనా నేనున్నానంటూ ముందుకు దూకడం ఆమెకు అలవాటు. కరోనా సమయంలోనూ ఆమె ప్రజాసేవ నుంచి ఏమాత్రం దూరం కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News