మన తెలంగాణ/హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ములుగు ఎంఎల్‌ఎ సీతక్క డాక్టరేట్ అందుకున్నారు. తన పిహెచ్‌డి పట్టా సమర్పించి డాక్టరేట్ అందుకున్న క్షణాలను సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రజలతో, అభిమానులతో పంచుకున్నారు. ‘తుపాకీ పట్టి అడవిలో నక్సలైట్ లా తిరుగుతా అని ఎప్పుడూ అనుకోలేదు.. నక్సలైట్ గా ఉన్నప్పుడు లా చదివాను. లా పూర్తి చేసి లాయర్ అవుతా అని కూడా అనుకోలేదు. ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా ఉద్యమ ప్రతినిధిగా ఉండిపోతా అనుకున్నా. కానీ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజా ప్రతినిధిని చేశారు. ప్రజల సమస్యల వారి ప్రతినిధిగా అసెంబ్లీలో ఎన్నో సమస్యలపై ప్రశ్నించా. ఈ క్రమంలో పిహెచ్‌డి చేస్తానని, ఒకవేళ ప్రారంభించినా పూర్తి చేస్తానని అనుకోలేదు. కానీ ఇప్పుడు పిహెచ్‌డి పూర్తయింది. ఇకపై మీరంతా నన్ను డాక్టర్ సీతక్క అని పిలవొచ్చు. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి మాటలు సరిపోతలేవు.. అంటూ ములుగు ఎంఎల్‌ఎ సీతక్క ఉద్వేగానికి లోనయ్యారు.
ఓయూ మాజీ ఛాన్సలర్, మణిపూర్ సెంట్రల్ వర్సిటీ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ తిరుపతిరావు పర్యవేక్షణలో గొత్తికోయ గిరిజనుల సామాజిక స్థితిగతులపై ఎంఎల్‌ఎ సీతక్క రీసెర్చి పూర్తి చేశారు. సీతక్క సమర్పించిన థీసీస్‌ను పరిశీలించిన అధికారులు ఆమెకు పిహెచ్‌డి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిశోధనలో సహకరించిన ప్రొఫెసర్లు ముసలయ్య, అశోక్ నాయుడు, చంద్రునాయక్‌లకు సీతక్క ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆమె తన సంతోషాన్ని షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ‘ప్రజలకు సేవ చేయడం, జ్ఞానాన్ని పొందడం నా అలవాటు. నా చివరి శ్వాస వరకు నేను దీన్ని ఎప్పటికీ ఆపను. నా పిహెచ్‌డి పూర్తి చేసేందుకు సహకరించి నన్ను ప్రోత్సహించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ఇదే ఏడాది జులైలో సీతక్క ఎల్‌ఎల్‌ఎం ప్రవేశ పరీక్ష రాశారు.
Seethakka receives doctorate from Osmania University