79 రోజుల తర్వాత ప్రధాని మోడీ మాట్లాడడం బాధాకరం
మణిపూర్ ప్రజలకు మోడీ, అమిత్ షా,
కిషన్‌రెడ్డిలు బహిరంగ క్షమాపణలు చెప్పాలి
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క
మనతెలంగాణ/హైదరాబాద్: మణిపూర్‌లో దారుణం జరుగుతోందని, 79 రోజుల తర్వాత ప్రధాని మోడీ మాట్లాడడం బాధాకరమని, ఆయనకు ఏం తెలియనట్లుగా చెబుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. గురువారం ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తనపై వ్యక్తం చేస్తున్న ఆగ్రహాన్ని తగ్గించడానికి మోడీ మాట్లాడారని, మణిపూర్ సంఘటన సభ్యసమాజం సిగ్గుపడేలా ఉందని, కుకీ తెగపై దాడులు, అత్యాచారాలు బాధాకరమన్నారు. గత నెలలో రాహుల్ పర్యటనను బిజెపి ప్రభుత్వం అడ్డుకుందని ఆయన ఆరోపించారు. మణిపూర్ ఘటనకు బిజెపి సర్కార్ వైఫల్యమే కారణమన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ఉన్న స్పెషల్ స్టేటస్‌ను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఓటు బ్యాంకు రాజకీయాలే తప్పా మరేం లేవని, పిల్లలు అని చూడకుండా అత్యాచారాలు జరుగుతున్నాయని సీతక్క మండిపడ్డారు.
Also Read: ఎన్‌డిఎ X ‘ఇండియా’!
మణిపూర్ సిఎం కూడా ఇవేం కొత్తవి కాదని చెప్పడం బాధాకరమన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇన్‌చార్జీగా ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా దీనిపై మాట్లాడడం లేదని ఆమె విమర్శించారు. గుజరాత్‌లో మోడీ సిఎంగా ఉన్నప్పుడే గోద్రా ఘటనలో వేలాది మహిళలు చనిపోయారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. యునైటెడ్ ఇండియా టీమ్ కూడా మణిపూర్ కోసం పనిచేస్తోందన్నారు. మణిపూర్‌లో జరిగే ఘటనలు బయటకు రావడం లేదని, ఆర్మీ నెట్‌వర్క్ అంతా బిజెపి చేతుల్లోనే ఉందని ఆమె విమర్శించారు. మణిపూర్ ప్రజలకు మోడీ, అమిత్ షా, కిషన్ రెడ్డిలు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.