హైదరాబాద్: మణిపూర్ లో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంఎల్ఎ సీతక్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “ఆడ పిల్లలను బహిరంగంగా నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన ఘటన మానవత్వానికి మచ్చను తెచ్చే విధంగా ఉంది. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేక తాలిబన్ల దేశంలో ఉన్నామా? ఘటన జరిగిన 79 రోజుల తరువాత అది బయటకి రావడం, ఇలాంటి ఘటనలు వందల కొద్ది జరిగాయని స్వయంగా అక్కడి ముఖ్యమంత్రి ఒప్పుకోవడం, అక్కడ ఇంటర్నెట్ రద్దు చేసి సమాచారం బయటకి రాకుండా అడ్డుకోవడం.. ఇదంతా మోడీ ప్రభుత్వం కావాలనే చేస్తుందని స్పష్టంగా తెలుస్తుంది” అని సీతక్క మండిపడ్డారు.
కాగా, మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు దద్దరిల్లింది. ఈ ఘటపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సప్రీం కోర్టు కూడా సీరియస్ అయ్యింది.