గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్ది శాఖకు వన్నే తీసుకురావాలి
విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదు
డిపిఒలతో జరిగిన సమీక్షలో మంత్రి సీతక్క
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యక్తిగా తాను ఎంత సున్నితమో, విధుల పట్ల అంతే కఠినంగా ఉంటానని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పట్ల సున్నితంగా వ్యవహరించినా, విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎర్రమంజిల్ లోని గ్రామీణ మంచి నీటి సరఫరా కేంద్ర కార్యాలయంలో ఆదివారం జిల్లా పంచాయతీ అధికారులతో (డీపీఓ) మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, డైరెక్టర్ శ్రీజనతో కలిసి గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను సమీక్షించారు.
మూడున్నర గంటల పాటు సాగిన సమావేశంలో అన్ని జిల్లాల డీపీఓల అభిప్రాయాలను మంత్రి సీతక్క తెలుసుకున్నారు. గ్రామాల్లో నిధుల వినియోగం, పారిశుద్ధ్య నిర్వహణ, తాగు నీటి సరఫరా, పనుల పురోగతి, పచ్చదనం, ఆయా జిల్లాల్లో నెలకొన్ని పరిస్థితులపై చర్చించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో మెరుగైన ఫలితాలు సాధించాలని దిశా నిర్దేశం చేసారు. శాఖకు వన్నే తెచ్చే విధంగా పనిచేసి, గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. డిపిఓలు తమ వద్ద ఉన్న వివరాలు తెలియజేసిన అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ మన దేశం గ్రామాల్లోనే నివసిస్తుందని, అందుకే పల్లెల అభివృద్దిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. అయితే పల్లెలను ప్రగతి పథంలో నిలిపేలా డీపీఓలు పనిచేయాలని కోరారు. గ్రామీణ ప్రజలకు గౌరవప్రదమైన జీవనం, గ్రామాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
అంగన్ వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలకు సురక్షిత మంచి నీరు సరఫరా అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా అవుతున్న తాగు నీటి విషయంలో ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పాఠశాలలు తెరిచే లోపు తాగు నీటి సరఫరా పూర్తవుతున్నందున ఈ సమస్యను పరిష్కరించేందుకు హెడ్ మాస్టర్, పంచాయతీ కార్యదర్శిలు సమన్వయంతో వ్యవహరించి ఉదయమే ట్యాంకులు నింపుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను బట్టి ప్రణాళికల రూపొందించుకుని, ఆచరణలో పెట్టాలని కోరారు. గ్రామీణ ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కినందుకు అందరు గర్వపడాలని, ఇది ఉద్యోగంగా కాకుండా బాధ్యతగా ప్రజలకు సేవలిందించాలని తెలిపారు. మానవత్వాన్ని జోడించి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. కొన్ని జిల్లాల్లో అనుకున్నంత మేర పనులు ముందుకు సాగడం లేదని, పొరపాట్లను సరిదిద్దుకుని పనుల్లో వేగం పెంచాలని కోరారు.
ప్రతి నెల డీపీఓలతో సమీక్షలు
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు సహకారం ఉంటుందని పేర్కొన్న మంత్రి సీతక్క విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పీఆర్ ఆర్డీ శాఖలో 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల ఫైల్ ను క్లియర్ చేయించిన విధంగానే డీపీఓల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని సీతక్క స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రతి నెల డీపీఓలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
డీపీఓలు తమ కింది స్థాయి ఉద్యోగులతో 15 రోజులకు ఒకసారి సమీక్షలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని మంత్రి ఆదేశించారు. శాఖను తాను కుటుంబంగా భావిస్తానని, గ్రామీణ ప్రజల జీవితాలతో పెనవేసుకున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖకు తాను మంత్రిగా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తానని మంత్రి సీతక్క పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ శాఖను సొంత కుటుంభంగా భావించి అధికారులు పనిచేయాలని సూచించారు. వచ్చే వేసవిలో తాగు నీటి సమస్యలు లేకుండా కార్యాచరణ ప్రణాళికను వేగవంతం చేయాలని ఆదేశించారు. గ్రామీణ మంచి నీటి సరఫరా అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు.
ప్రతి నెల 5 లోపు వారికి జీతాలు చెల్లింపు
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో సఫాయి కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్ల దే కీలక పాత్ర అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అందుకే వారికి ప్రతి నెల ఐదో తారీఖు లోపు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గతంలో మాదిరిగా గ్రామ పంచాయతీల ద్వారా కాకుండా నేరుగా పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచే ఏకకాలంలో జీతాలు చెల్లించే విధానాన్ని అవలంభిస్తున్నట్లు తెలిపారు. ఇక పీఆర్, ఆర్డీ శాఖ కార్యదర్శి లోకేష్ మాట్లాడుతూ గ్రామాల్లో స్వచ్చదనం, పచ్చదనం పెంపొందించేలా ఆదేశాలు జారీ చేశామని అన్నారు.
గ్రామాల్లో రోడ్ల వెంట మురుగు నీరు పారితే సంబంధిత పంచాయతీ కార్యదర్శులను భాద్యులుగా చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో చెత్త సేకరణ పక్కాగా జరగాలని, తడిచెత్త పొడి చెత్తను వేరు చేసే విధానాన్ని అవలంభించాలని కోరారు. స్థానిక ఎన్నికల షెడ్యుల్ త్వరలో వచ్చే అవకాశం ఉన్నందున అధికారులంతా సిద్దంగా ఉండాలని సూచించారు. కమిషనర్ శ్రీజన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు మొదలుకుని డీపీఓల వరకు అంతా సమయ పాలన పాటించి, పనితీరును మెరుగు పరుచుకోవాలని సూచించారు. గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేలా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు.