Friday, January 17, 2025

మంత్రుల మెప్పు కోసం వాస్తవాలు దాచి పెట్టొద్దు

- Advertisement -
- Advertisement -

అధికారులు నిబద్ధతతో పనిచేయాలి
తప్పులు చేయొద్దు..జైలుపాలు కావద్దు
అధికారులను సున్నితంగా హెచ్చరించిన మంత్రి సీతక్క

మన తెలంగాణ/హైదరాబాద్: “మంత్రుల మెప్పుకోసం వాస్తవాలను దాచి పెట్టొద్దు, శాఖపరంగా వాస్తవాలనే నివేదించాలి, అధికారులు, అమాత్యులు వేర్వురు కాదు, మీరు పొరపాట్లు చేసి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేయొద్దు..ఎవరూ తప్పులు చేయొద్దు, జైలు పాలు కావద్దు’ అని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క అధికారులను సున్నితంగా హెచ్చరించారు. అధికారులంతా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా పని చేయాలని సూచించారు.

రాష్ట్ర సచివాలయంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై గురువారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి సీతక్క మాట్లాడుతూ అధికారులు నిబద్ధతతో పనిచేసి శాఖ గౌరవాన్ని నిలబెట్టాలన్నారు. శాఖకు వన్నె తెచ్చేలా పనిచేయాలని సూచించారు. కింది ఉద్యోగులతో సంప్రదింపులు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. రూ.300 కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఏ బిల్లులను నిన్న విడుదల చేశామని మంత్రి సీతక్క వెల్లడించారు. అలాగే మల్టీ పర్పస్ వర్కర్ల వేతన బకాయిలను కూడా విడుదల చేశామని తెలిపారు.

ప్రతి విభాగంలో ఆన్‌లైన్‌లో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

పంచాయతీరాజ్ శాఖ తరహాలోనే ప్రతి విభాగంలో ఉద్యోగ సమస్యలను ఆన్‌లైన్‌లో పరిష్కరించే విధానాన్ని అవలంభించాలని అన్నారు. అర్హులైన ప్రతి గర్భిణీ, బాలింత, చిన్నారికి పోషకాహారం అందించాలని సూచించారు. ఆ దిశలో జిల్లా సంక్షేమ అధికారులను సిద్ధo చేయాలని మంత్రి సీతక్క చెప్పారు. అంగన్వాడీ సేవలపై చిన్నారుల తల్లిదండ్రుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని అన్నారు. ప్రతి నెలలో ఒకసారి ఫోన్ ఇన్ విత్ పేరెంట్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. తల్లిదండ్రుల అభిప్రాయాల మేరకు అంగన్వాడీ సిబ్బందిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంగన్వాడీకి వచ్చే గర్భిణులు కింద కూర్చోవడానికి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

వారి ఇబ్బందులను తొలగించే విధంగా అంగన్వాడి కేంద్రాల్లో బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించారు. దివ్యాంగుల పరికరాల కోసం తెలంగాణ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోని డ్రైవ్ నిర్వహించి దివ్యాంగులకు పరికరాలను అందజేస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి దివ్యాంగులకు పరికరాలను అందజేస్తామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికంలో ఉన్నందున బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకునే విధంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి లోకేశ్‌కుమార్, డైరక్టర్ డా.సృజన, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News