Monday, March 24, 2025

తమ్ముడూ నీ లైఫ్ స్టైల్ వేరు..నా లైఫ్ స్టైల్ వేరు..!

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ క్వార్టర్‌లోనే నేను ఉంటున్నాను
మీలా ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కోటలో నివసించడం లేదు
అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డిపై మంత్రి సీతక్క ఆగ్రహం

మన తెలంగాణ/హైదరాబాద్: ‘తమ్ముడూ నీ లైఫ్ స్టైల్ వేరు..నా లైఫ్ స్టైల్ వేరు, ప్రభుత్వం వసతి కల్పించిన క్వార్టర్‌లోనే నేను నివసిస్తున్నాను, మీలా ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కోటల్లో నివసించడం లేదు’ అని శాసనసభ వేదికగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డిపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నియోజకవర్గంలో నేను తిరిగినట్లు నువ్వు తిరగలేవు, ప్రజలకు ఎవరు ఎక్కువ అందుబాటులో ఉంటారో తేల్చుకుందాం’ అని మంత్రి గట్టి కౌంటర్ ఇచ్చారు. శాసనసభలో శనివారం పలు పద్దులపై జరిగిన చర్చలో పాల్గొన్న కౌషిక్ రెడ్డి సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం లేదన్న వ్యాఖ్యలను సీతక్క ఖండించారు.

ఈ సందర్భంగా కాసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం ఆసక్తిగా జరిగింది. హైదరాబాద్‌లో తిరిగే వాళ్ల్లకు రైతులకు బోనస్ వస్తుందో లేదో తెలుస్తుందా?, రైతులతో సంబందం లేకుండా హైదరాబాద్‌లో తిరుగున్నట్లు ఉందని మంత్రి మండిపడ్డారు. బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ చేసింది మీరేనని, వరి వేస్తే ఉరి అన్నది కూడా మీరేనని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం సన్న వడ్లకు రూ.1200 కోట్లు బోనస్ ఇచ్చిందని, ఇంకా ఎవరికన్నా రాకపోతే అవి కూడా ఇస్తామని సభావేదికగా మంత్రి సీతక్క వెల్లడించారు. రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నామని, భూమి లేని వాళ్లకే కూలీ భరోసా ఇస్తున్నామని చెప్పారు.

నాది నిరాడంబర జీవితం

నాది నిరాడంబర జీవితం, నా కుమారుడు కూడా హన్మకొండ లోనే ఉంటాడని మంత్రి సీతక్క అన్నారు. నీ జీవన విధానం, నా జీవన విధానం ప్రజలకు తెలుసునని పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. వైయస్‌ఆర్ భవనంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మా ఇంటికి వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని అన్న సీతక్క టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు మా ఇంటికి రావాలని ఆహ్వానం పలుకుతున్నానని అన్నారు. మీ అందరిని భోజనానికి ఆహ్వానిస్తున్నాను, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆహ్వానించలేదని అన్నారు.

నేనేమీ సీతక్కను అనరాని మాటలు అనలేదు: కౌశిక్‌రెడ్డి

మంత్రి సీతక్కను తానేమీ అనరాని మాటలు ఏమీ అనలేదని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వివరణ ఇచ్చారు. మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసిన అనంతరం కౌశిక్‌రెడ్డి స్పందిస్తూ మీరు ప్రభుత్వ భవనంలో ఉన్నారని మాత్రమే అన్నాను తప్ప ఇంకేమీ అనలేదని అన్నారు. తాను మాత్రం కోటలో లేనని, 500 గజాల ఇంట్లోనే ఉంటున్నానని బదులిచ్చారు. ప్రభుత్వం సిఎం కోసం నిర్మించి ఇంట్లో ఉంటున్నారని అన్నాను తప్ప ఎలాంటి విమర్శలు చేయలేదని అన్నారు. ఈ విషయంపై కొందరు కాంగ్రెస్ సభ్యులు రికార్డుల నుంచి కౌశిక్‌రెడ్డి మాటలు తొలగించాలని కోరారు. ఈ సందర్భంగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుని ఒక గిరిజన మహిళ, మంత్రి అయిన సీతక్కను ఉద్దేశించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు. శ్రీధర్ అన్నగారు తనకు గురువుతో సమానమని, రాజకీయం తాను ఆయన నుంచే నేర్చుకున్నానని కౌషిక్ రెడ్డి అన్నారు. దీంతో కాసేపు వాగ్వాదం తర్వాత మరో సభ్యుడు మాట్లాడడంతో సద్దుమణిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News