Monday, December 23, 2024

మారిషస్ దీవిలో భారత సంతతి

- Advertisement -
- Advertisement -

Seewoosagur Ramgoolam Biography

ప్రపంచ దేశాలలో భారత కుటుంబాల మూలాలు గల వారు ఎందరో ఉన్నారు. దేశం నుండి వలస వెళ్ళి పలు దేశాలలో రాజకీయాలలో రాణిస్తూ వివిధ పదవులు పొందిన, పొందుతున్న వారెందరో ఉన్నారు. అయితే ఒక దేశ రాజకీయాలను ప్రభావితం చేసి, రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగి, ఆ దేశస్వాతంత్య్రం కోసం పోరాడి, విజయం సాధించి, దేశ తొలి ప్రధాని పదవిని పొందడం సామాన్య విషయం కానేకాదు. అలాంటి నేపథ్యం కలిగిన మహోన్నత వ్యక్తిగా చరిత్ర పుటల కెక్కిన అరుదైన, అపూర్వమైన, అనితర సాధ్యమైన ఘనత శివసాగర్‌కే దక్కింది. మారిషస్ ఆఫ్రికా ఆగ్నేయ తీరంలో 65 కి.మీ (40మై) పొడవు, 45 కి.మీ (30మై) వెడల్పు ఉంటుంది. ప్రారంభంలో డచ్చి కాలనీ (1630-1710) తరు వాత ఫ్రెంచి కాలనీ (1715 -1810)గా ఉండి తరువాత బ్రిటిష్ కాలనీగా మారి 1968 వరకు బ్రిటిషు ఆధీనంలో ఉండి తరువాత స్వాతంత్య్రం పొందింది. శివసాగర్ రాంగులామ్… మారిషస్ దేశపు అగ్ర రాజకీయ నాయకులు, స్వాతంత్య్ర సమర యోధులు, మానవతావాది. బ్రిటీష్ వలసపాలన నుంచి మారిషస్‌ను విముక్తం చేసే ఉద్యమానికి నాయకత్వం వహించడంతో ఆయనను మారిషస్ జాతిపితగా భావిస్తుంటారు. అలాంటి మారిషస్‌కు శివసాగర్ తొలి ముఖ్య మంత్రిగా, ప్రధాన మంత్రిగా పని చేశారు. మారిషస్‌కు గవర్నర్ జనరల్ గానూ పని చేశారు.

శివసాగర్ రాంగులామ్ మారిషస్‌కు చెందిన భారత సంతతి వ్యక్తి. ఆయన తండ్రి మోహీత్ రాంగులామ్ బీహార్‌కు చెందిన హరిగావ్ నుంచి మారిషస్‌కు వలస వెళ్ళారు. మోహీత్ మారిషస్‌లో కార్మికునిగా, మేస్త్రీగా పనిచేసేవారు. ఆయన బాస్మతీ రాంచరణ్ ని వివాహం చేసుకాగా, వారికి 1900 సంవత్సరంలో సెప్టెంబర్ 18న శివసాగర్ రాంగులామ్ జన్మించారు. శివసాగర్ మాతృభాష భోజ్ పురి కాగా హిందీ, సంస్కృతం వంటి భారతీయ భాషల్లో లోతైన అభినివేశం ఉండేది. హిందూ పురాణాలు, భారతీయ సంస్కృతి తదితర అంశాలపై ఆసక్తి, అవగాహన ఉండేది. పేద కుటుంబంలో జన్మించినా కష్టించి చదివి ఇంగ్లండు వెళ్ళి వైద్యవిద్యను అభ్యసించి డాక్టర్ అయ్యారు. ఇంగ్లాండులో ఉండగా 1932లో రౌండు టేండు సమావేశాలకు వచ్చిన మహాత్మా గాంధీని కలిశారు. మహాత్మాగాంధీ ఆయనను చాలా ప్రభావితం చేశారు. అలాగే జవహర్‌లాల్ నెహ్రూ, రాస్ బిహారి బోస్ వంటివారితో కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవి. 1935లో రాంగులామ్ ఇంగ్లాండు నుండి మారిషస్ చేరుకున్నారు. అప్పటికే స్వాతంత్య్ర సముపార్జన గురించి ఆలోచనలు చేసిన రాంగులామ్ స్వదేశానికి తిరిగి వచ్చాక స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం వహించారు. 1949లో మారిషస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నాయకత్వం వహించిన లేబర్ పార్టీ విజయం సాధించింది. 1968లో మారిషస్‌కు బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం లభించింది. శివసాగర్ రాంగులామ్ సుదీర్ఘ పోరాటం ఫలితంగానే మారిషస్‌కు స్వాతంత్య్రం లభించిందని చాలా మంది చరిత్రకారులు, జనం భావిస్తూంటారు.

శివసాగర్ రాంగులామ్ మారిషస్ ప్రజాదరణతో జాతి పితగా పేరొందారు. స్వాతంత్య్ర స్థితిగతులు ఏర్పడుతుండగా 1961లోనే శివసాగర్ మారిషస్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పదవిలో 1968 వరకూ కొనసాగారు. దేశంలోని అన్ని వర్గాలను సమీకరించి అఖిల పక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న నమ్మకాన్ని కలోనియల్ ఆఫీస్ ఆయనపై పెట్టుకుంది, ఆ క్రమంలోనే 1965లో నైట్ హుడ్ గౌరవాన్ని పొందారు. 1968లో మారిషస్‌కు స్వాతంత్య్రం వచ్చాక ప్రధాన మంత్రి పదవిలో కొనసాగారు. 1968 నుంచి 1982 వరకూ వరుస ఎన్నికలను ఎదుర్కొంటూ సంకీర్ణ ప్రభుత్వాలను నిలబెట్టుకుని ప్రధాన మంత్రిగా సుదీర్ఘకాలం కొనసాగారు. 1982 సాధారణ ఎన్నికల్లో మారిషస్ మిలిటెంట్ మూమెంట్ (ఎంఎంఎం) భాగస్వామ్య పక్షాల చేతిలో ఓటమి చెందారు. మిలిటెంట్ సోషలిస్ట్ మూమెంట్ పార్టీకి చెందిన మరో తెలుగు ప్రాంత మూలాలు కలిగిన అనిరూధ్ జగ్నాథ్ ప్రధాని అయ్యారు, అయితే కొద్ది కాలానికే చీలికలు రావడంతో ప్రభుత్వం కూలిపోయింది. శివసాగర్ రాంగులామ్ తన పార్టీ జగ్నాథ్ మిలిటెంట్ మూమెంట్ పార్టీని సమర్థించారు. జగ్నాథ్ ఎన్నికై ప్రధాని కావడంతో శివసాగర్ సహకారానికి ఫలితంగా ఆయనను గవర్నర్ జనరల్‌గా నియమించారు. గవర్నర్ జనరల్ పదవిలో ఆయన 1985లో మరణించేంత వరకూ కొనసాగారు.

మారిషస్ గవర్నర్ జనరల్ గా ఉన్న సమయంలోనే 1985లో అధికారిక నివాసంలోనే శివసాగర్ రాంగులామ్ మరణించారు. శివసాగర్ కుమారుడు నవీన్ రాంగులామ్ లేబర్ పార్టీ నాయకత్వాన్ని స్వీకరించారు. నవీన్ 1995లోనూ, 2005 లోనూ రెండు మార్లు ప్రధానమంత్రి పదవి చేపట్టి దాదాపుగా 15 సంవత్సరాలు మారిషస్‌ను పరిపాలించారు. శివసాగర్ రాంగులాం పేరిట పలు స్మారక చిహ్నాలు రూపుదిద్దుకున్నాయి. మారిషస్‌లోని ప్రధాన విమానాశ్రయానికి సర్ శివసాగర్ రాంగులామ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేశారు. మారీషియన్ రూపాయి నాణేలు అన్నిటిపైనా శివసాగర్ రూపం ఉంటుంది, అలానే అత్యధిక కరెన్సీ అయిన రెండు వేల మారిషయన్ రూపాయల నోటుపైనా ఆయన బొమ్మ ముద్రించి ఉంటుంది. మారిషస్‌లో పలు ప్రాంతాలు – పార్కులు, రోడ్లకు ఆయన పేరు పెట్టారు. పోర్ట్ లూయీస్ నగరంలో, భారత దేశంలో శివసాగర్ పూర్వుల ప్రాంతమైన బీహార్ రాజధాని పాట్నాలోనూ స్మారక చిహ్నాలు నిర్మించారు.

* రామ కిష్టయ్య సంగన భట్ల- 9440595494

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News