గౌహతి: దుబాయి మ్యూజియంలో చోరీకి గురైన అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా చేతి గడియారాన్ని అస్సాం రాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అస్సాంకు చెందిన ఓ వ్యక్తి గడియారం దొరికిందని పోలీసులు వెల్లడించారు. దుబాయిలోని ఓ మ్యూజియంలో భద్రపరిచిన మారడోనా చేతి గడియారం చోరీకి గురైంది. దీనిపై పోలీసులు ముమ్మర దర్యాఫ్తు చేశారు. ఈ క్రమంలో మ్యూజియంలో సెక్యూరిటీ గార్డ్‌కు పనిచేస్తున్న అస్సాంకు చెందిన వాజిద్ హుస్సేన్ గడియారాన్ని దొంగలించినట్టు తేలింది. కాగా, వాజిద్ కొంతకాలం క్రితం భారత్‌కు వచ్చేశాడు. అయితే అతనిపై అనుమానంతో దుబాయి పోలీసులు భారత పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో రంగంలోకి దిగిన భారత పోలీసులు అనుమానితుడి ఇంట్లో శనివారం తెల్లవారుజాము సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మారడోనాకు చెందిన చేతి గడియారం లభ్యమైంది. అతను చోరీకి పాల్పడినట్టు తేలడంతో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరు దేశాల పోలీసులు పరస్పరం సమన్వయంతో వ్యవహరించడం వల్లే నిందితుడ్ని పట్టుకోవడం సాధ్యమైందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. కాగా దుబాయి మ్యూజియం నుంచి మారడోనా చేతి గడియారం చోరీకి గురికావడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే దీనిపై పూర్తి స్థాయి దర్యాఫ్తు జరిపిన దుబాయి పోలీసులు ఎట్టకేలకు నిందితుడ్ని పట్టుకున్నారు.