Monday, January 20, 2025

డ్రగ్స్ నెట్ లో తారా తోరణం..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో డ్రగ్స్ పట్టుబడడంతో శుక్రవారం ఒక్కసారిగా కలకలం సృష్టించింది. బెంగళూరు, ముంబాయి నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 8.56 గ్రాములు హెరాయిన్, 50గ్రాముల ఎండిఎంఏను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….టోలీచౌకికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితుడు ముంబాయికి వెళ్లి గయాజ్ అనే వ్యక్తి వద్ద నుంచి హెరాయిన్ కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చాడు. ఇక్కడ అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నాడు. ఈ విషయం ఫిలింనగర్ పోలీసులకు తెలిసింది. మఫ్టీలో వెళ్లిన ఎస్సై గణేష్ ఇర్ఫాన్ వద్దకు వెళ్లి డ్రగ్స్ కావాలని అడగడంతో వెంటనే చేతిలో హెరాయిన్ డ్రగ్స్ పెట్టాడు.

వెంటనే పట్టుకున్న పోలీసులు అతడి వద్ద నుంచి 8.56 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసిన ఫిలింనగర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. డ్రగ్స్ విక్రయించిన ముంబాయికి చెందిన గయాజ్ పరారీలో ఉన్నాడు.
కాగా, వనస్థలిపురంలో ఎండిఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న కేరళకు చెందిన చలాపురాత్ సుమేష్‌ను అరెస్టు చేశారు. నిందితుడు గతంలో కూడా గంజాయి తీసుకుని వచ్చి నగరంలో విక్రయిస్తుండగా పోలీసులు గతంలో అరెస్టు చేశారు. మరో నిందితుడు ఆధూ శల్‌బిన్ పరారీలో ఉన్నాడు. నిందితుడి వద్ద నుంచి 50 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, రూ.2,040 నగదు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన సుమేష్ ఎపిలోని రాజమండ్రి, దేవీచౌక్‌లో ఉంటున్నాడు. నిందితుడికి గంజాయి తాగే అలవాటు ఉంది. గంజాయిని కొనుగోలు చేయడమే కాకుండా దానిని స్నేహితులకు విక్రయించేవాడు. 2021లో నిందితుడు 240 కిలోల గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

పిడి యాక్ట్ పెట్టి చర్లపల్లి జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత రాజమండ్రిలో ఉంటున్నాడు. అక్కడ చేస్తున్న పనిలో వస్తున్న డబ్బులు సరిపోకపోవడంలేదు. ఈ క్రమంలోనే తనకు తెలిసిన వారి నుంచి సింథటిక్ డ్రగ్స్‌కు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉన్న విషయం తెలుసుకున్నాడు. కేరళకు చెందిన స్నేహితుడు షాల్‌బిన్ బెంగళూరులో ఉంటున్నాడు. అతడి ద్వారా కర్ణాటకలో డ్రగ్స్ విక్రయించే వారితో పరిచయం పెంచుకున్నాడు. వారి వద్ద డ్రగ్స్‌ను ఎండిఎంఏను గ్రాముకు రూ.4,000 నుంచి రూ.5,000లకు కొనుగోలు చేస్తున్నాడు. వాటిని నగరానికి తీసుకుని వచ్చి అవసరం ఉన్న వారికి రూ.6 నుంచి 8వేలకు విక్రయిస్తున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, వనస్థలిపురం పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News