కాదనడం అనుచితమే
లాయర్ పిటిషన్ కొట్టివేత
రూ 5 లక్షల వ్యయ జరిమానా
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎంపిక
ఆరోపణలున్నాయని దాఖలైన వ్యాజ్యం
న్యూఢిల్లీ : అనుభవం, ప్రతిభ వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకునే హైకోర్టు న్యాయమూర్తుల నియామకం జరిగిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జడ్జిల నియామకానికి సంబంధించి ఖరారయి ఉన్న నిర్థిష్ట నిర్ధేశిత ప్రక్రియకు అనుగుణంగానే పలు దశలవారిగా న్యాయమూర్తుల ఎంపిక చేపడుతారని తెలిపింది. ప్రభుత్వం నుంచి తమకు అందే సీనియార్టీ, మెరిట్ ఇతర ప్రాతిపదిక అంశాలను స్వీకరించి, హైకోర్టుల కొలీజియం ఓ నిర్ణయానికి వస్తుందని స్పష్టం చేశారు. ఇటీవల తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వర్ రెడ్డిని తెలంగాణ హైకోర్టు జడ్జిగా నియమించడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది బి శైలేష్ సక్సేనా దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీ ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. జడ్జిగా పదోన్నతి ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నించడమే కాకుండా, కోర్టు కార్యకలాపాలను తప్పుపట్టినందుకు ఆయనపై రూ. 5 లక్షల వ్యయ మొత్తాన్ని జరిమానాగా విధించింది.
న్యాయమూర్తులు ఎస్‌కె కౌల్, ఎంఎం సుంద్రేష్‌తో కూడిన ధర్మాసనం ఈ న్యాయవాది వ్యాజ్యాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. గత నెల 17వ తేదీన సుప్రీంకోర్టు కొలీజియం సమావేశం నిర్వహించి, ఆరుగురు జుడిషియల్ అధికారులను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలనే ప్రతిపాదనలను ఆమోదించింది. ఇందులో హైకోర్టు రిజిస్టర్ జనరల్ ఎ.వెంకటేశ్వర రెడ్డి పేరు కూడా ఉంది. అయితే ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయని, పైగా రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తి అని, ఆయనకు పదోన్నతి ప్రక్రియను తదుపరి ఆదేశాల మేరకు నిలిపివేయాలని పిటిషనర్ అభ్యర్థించారు. అయితే కేసు పూర్వాపరాలను విచారించిన ధర్మాసనం అన్ని విషయాలను పరిశీలించి పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. పిటిషనర్ అనుచిత వైఖరితో హైకోర్టు ప్రక్రియ దెబ్బతిన్నందున జరిమానా విధించింది.