ఇప్పటివరకు 80శాతం వరకు దరఖాస్తులు వడపోత
కొత్త ఏడాది జనవరి నుంచి అర్హుల ఖాతాలో నగదు జమ
గ్రేటర్‌లో పరిధిలో కొత్తగా 1.10 దరఖాస్తులు సమర్పణ
డిసెంబర్ రెండో వారం ఎంపిక ప్రకియ పూర్తి చేస్తామంటున్న అధికారులు
గ్రేటర్‌లో 3.50 లక్షలకు చేరుకోనున్న ఆసరా లబ్దిదారులు
హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో కొత్త ఆసరా ఫించను దరఖాస్తుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు 80 శాతం దరఖాస్తులను వడిపోసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. డిసెంబర్ రెండో వారంలోగా అర్హుల ఎంపిక పూర్తి చేసి కొత్త సంవత్సరం జనవరి నుంచి లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. గత నెల 31వరకు కొత్త దరఖాస్తులు 1.10లక్షల వరకు వచ్చినట్లు ,వాటిని త్వరగా పరిశీలించి పేదలకు అందిస్తామని చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ నిజమైన ఎలాంటి పైరవీలకు తావు లేకుండా నిజమైన లబ్దిదారులను గుర్తించి పింఛను అందజేస్తామని వెల్లడిస్తున్నారు. మూడు నెల కితం ప్రభుత్వం వయస్సు కుదించి 57 ఏళ్ల వారికి ఫించన్లు అందజేస్తామని అర్హులైన వారు మీసేవా కేంద్రాల దరఖాస్తులు చేసుకోవాలని సూచించడంతో తమ వద్ద పత్రాలు తీసుకుని నగర ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు దరఖాస్తులు ఓటర్ లిస్టు, ఆధార్‌కార్డుల ద్వారా వయస్సు నిర్దారణ చేసి లబ్దిదారుల ఎంపిక వేగంగా చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో ప్రస్తుతం వృద్దాప్యం ఫించన్లు 1.42లక్షలమంది పొందుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వారికి ప్రతి నెల ప్రభుత్వ రూ. 2016 చొప్పన అందజేస్తుంది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ఫించన్లు పెరిగి వృద్దులు, వితంతులు, వికలాంగులు ఎంతో ఆనందంగా ఉన్నారని స్దానిక ప్రజలు పేర్కొంటున్నారు. కొత్త ఆసరా ఎంపిక ప్రక్రియ పూర్తి అయితే గ్రేటర్ నగరంలో ఫించన్లు సంఖ్య 3.50లక్షలకు చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో అర్హతలేకున్నా బోగస్ దృవపత్రాలు సమర్పించి ప్రభుత్వం ఖజానాకు గండి కొట్టాలని కుట్రలు చేస్తున్నారు. దరఖాస్తుపై అనుమానం ఉంటే నేరుగా ఇంటికి వెళ్లి పరిశీంచిన చేసి ఎంపిక చేస్తామని వెల్లడిస్తున్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా ఎంపిక చేసి వృద్దులకు చేయూతనందిస్తామని స్దానిక రెవెన్యూ సిబ్బంది పేర్కొంటున్నారు. బస్తీలు, కాలనీలో కొంతమంది స్దానిక నాయకులు రాజకీయ పార్టీ పెద్దలు పేరు చెప్పుకుంటూ వారి సహాయంతో మీకు ఫించన్లు ఇప్పిస్తామని మాయమాటలు చెబుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని వారిపట్ల పేద ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు.