ముంబయి: ఐపిఎల్ 2022లో రెండు కొత్త జట్లు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎనిమిది ఫ్రాంచైజిలతో దిగ్విజయంగా సాగుతున్న మెగా టి20 లీగ్ వచ్చే ఏడాదినుంచి మరింత పెద్దది కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా సాగిపోతున్నాయి. ఈ క్రమంలోనే బిసిసిఐ ఇటీవల రాబోయే రెండు కొత్తఫ్రాంచైజీలు, ఆయా జట్ల నిర్వహణ కోసం టెండర్లు విడుదల చేసింది. అక్టోబర్ 5న ఆ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ కొత్త జట్ల ఆటగాళ్ల వేలం పాటను అక్టోబర్ 17న నిర్వహిస్తున్నారని సమాచారం. అహ్మదాబాద్, లక్నో, పుణెలు వాటికి సొంత వేదికలుగా ఖరారయ్యే వీలుంది. దీంతో వచ్చే ఏడాదినుంచి ఐపిఎల్‌లో పది జట్లు సందడి చేయనున్నాయి. మరో వైపు ఐపిఎల్ 2021లో మిగిలిన సీజన్ వచ్చే ఆదివారంనుంచి తిరిగి మొదలవుతుండగా అక్టోబర్ 15న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇది ముగిసిన రెండు రోజులకే ఐపిఎల్ 2022కు సంబంధించిన కొత్త జట్ల వివరాలు వెలువడే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.