సీనియర్ మావోయిస్ట్ నాయకుడు సెంట్రల్ కమిటీ సభ్యుడు జయరాం రెడి అలియాస్ చలపతి కొన్ని దశాబ్దాలుగా పోలీసుల కన్నుకప్పి తన కార్యకలాపాలు సాగిస్తూ వచ్చారు. కానీ, ఆయన భార్య అరుణ అలియాస్ చైతన్య వెంకట రవి తో తీసుకున్న ఓ సెల్ఫీ ఆయన ప్రాణాలకు ముప్పు తెచ్చింది. చత్తీస్ గఢ్ – ఒడిశా సరిహద్దుల్లో కేంద్ర , రాష్ట్ర పోలీసులతో మావోయిస్ట్ లకు జరిగిన ఎన్ కౌంటర్ లో చలపతి తో పాటు, 27 మంది నక్సల్స్ మరణించారు. చలపతిని పట్టి ఇస్తే కోటి రూపాయల నజరానా ప్రకటించింది ప్రభుత్వం. 2008 లో ఒడిశా నయాగఢ్ జిల్లాలో పోలీసు పై దాడి వెనుక కీలకవ్యక్తి చలపతి అని పోలీసులు అంటున్నారు. ఆ దాడిలో 13 మంది భద్రతా సిబ్బంది చనిపోయాారు. సిబ్బందిని హతమార్చి పోలీసులవద్ద ఆయుధాలను దోచుకుని చలపతి నయాగఢ్ నుంచి తప్పించుకు పారిపోయాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అయుధాలు దోచుకున్న తర్వాత నయాగఢ్ కు పోలీసులు రాకుండా ఎన్నో చెట్లు కూల్చివేసి రోడ్లకు అడ్డంకులు పెట్టడంతో అదనపు బలగాలు ఆ ప్రాంతానికి వెళ్లలేక పోయాయి.
చాలా ఏళ్లపాటు చలపతి తప్పించుకు తిరిగాడు. ఆయన భార్య అరుణ కూడా ఆంధ్ర – ఒడిశా సరిహద్దుల్లో స్పెషల్ జోనల్ కమిటీ డిప్యూటీ కమాండర్. కానీ, 2016 మార్చిలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్ కౌంటర్ సందర్భంగా చలపతి తప్పించుకున్నా.. అతడి స్మార్ట్ ఫోన్ పోలీసులకు చిక్కింది. అందులో ఆయన భార్య అరుణతో చలపతి తీసుకున్న సెల్ఫీ ఫోటో పోలీసులకు దొరికింది. సెల్ఫీ సాయంతో చలపతి ఆచూకీ కనుగొన్న పోలీసులు ఎట్టకేలకు అతడిని మట్టుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి కార్యకర్త నుంచి సెంట్రల్ కమిటీ సీనియర్ సభ్యుడిగా ఎదిగాడు. మొదట్లో చత్తీస్ గఢ్ లోని బస్తర్ లో తన కార్యకలాపాలు సాగించిన చలపతి, తరచు ఎన్ కౌంటర్లు జరగడంతో ఒడిశా సరిహద్దుల్లో ఉంటూ వచ్చాడు. గెరిల్లా యుద్ధ కళలోనూ, యుద్ధ కళలోనూ అతడు నిపుణుడని నక్సల్స్ లో అతడికి పేరు ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకూ వివిధ ఎన్ కౌంటర్లలో 40 మందికి పైగా మావోయిస్ట్ లు మరణించారు.