Saturday, December 21, 2024

నదుల పునరుద్ధరణ

- Advertisement -
- Advertisement -

Seminar on River Conservation

 అదే లక్షంగా పనిచేస్తున్న సిఎం కెసిఆర్ మూసీ నీళ్లు తాగించి చూపుతాం
మూసీ పునరుద్ధరణ పనులకు ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేసిన సిఎం కెసిఆర్
ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవెల్ సాగునీరు ప్రాజెక్టు కాళేశ్వరం
: నదుల పరిరక్షణపై సదస్సు ముగింపు సభలో మంత్రి హరీశ్‌రావు

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో నదుల పరిరక్షణ, నదుల పునరుద్ధరణ లక్షంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పనిచేస్తున్నారని రాష్ట్ర ఆర్ధిక వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీష్ రావు అన్నారు. నదుల పరిరక్షణపై మెగసేసే ఆవార్డు గ్రహీత డా.రాజేంద్ర సింగ్ అధ్యక్షతన జరుగుతున్న రెండురోజుల జాతీయ సదస్సులో భాగంగా ఆదివారం సాయంత్రం సదస్సు ముగింపు కార్యక్రమంలో మంత్రి హరీష్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 1956నాటికి హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న తాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేరి అభివృద్ధి పరంగా ఎంతో వెనుకబాటుకు గురయ్యామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ప్రాంత ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని పలు పథకాలు చేపట్టినట్టు తెలిపారు .అందులో భాగంగా మిషన్ కాకతీయను ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో కురిసిన ప్రతి వర్షపు చుక్కును మిషన్ కాకతీయ పధకం ద్వారా ఒడిసిపట్టి ఆయకట్టు పెంచుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో వున్న 46వేల చెరువులను పునరుద్ధరించుకున్నామన్నారు.

మిషన్ కాకతీయ తో కుంభవర్షాలు పడ్డా ఎక్కడా చెరువులు తెగలేదని , పనులు అంత సమర్ధవంతంగా నిర్వహించినట్టు తెలిపారు. రాష్ట్రంలో భూగర్భజలాలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో 4వేల చెక్ డ్యామ్ లను రూ.6వేల కోట్లవ్యయంతో నిర్మించుకున్నామని ,తద్వారా భూగర్భజలాలు పెరిగి సంవత్సరం అంతా చెరువులను వినియోగంలోకి తెచ్చుకునే అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. పట్టుదల ఉంటే కానిది ఏదీ లేదని సీఎం కేసీఆర్ నిరూపించారన్నారు. రాష్ట్రంలో గోదావరి నదిపైన 141 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్ధం ఉన్న రిజర్వాయర్ల నిర్మించుకున్నామన్నారు. మేడిగడ్డ, అన్నారం , సుందిళ్లతోపాటు గోదావరినదిపైన సమక్క, చనాకాకొరాట, ఎల్లంపల్లి అనకట్టలను నిర్మించడం వ 300కిలోమీటర్ల మేర గోదావరి సజీవనదిగా మారిందన్నారు. భవిష్యత్ తరాల కోసం నదులను కాపాడుకోవాలని, అందుకు సీఎం కేసీఆర్ చాల కార్యక్రమాలు చేపడుతున్నారు.

రాష్ట్రం ఏర్పడే నాటికి 2014లో తలసరి ఆదాయం రూ.1,24,104ఉంటే, 2021 నాటికి తలసరి ఆదాయం రూ.2,78,933కు పెరిగిందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రెండింతలు పెరిగినట్టు తెలిపారు. వ్యవసాయం, పశుసంవర్ధకం , పాడిపరిశ్రమ తదితర ప్రాధమిక రంగం రాష్ట్ర రాబడి రూ.19828కోట్ల నుంచి 2,16,285కోట్లకు పెరిగిందని తెలిపారు. ఏడేళ్లలోనే రూ.98వేలకోట్లు పెరిగిందన్నారు. 2014లో జిడిపి రూ.5.5లక్షల కోట్లు ఉండగా , 2021నాటికి రూ.11.54లక్షల కోట్లకు పెకరిగినట్టు రిజర్వ్‌బ్యాంక్ వెల్లడించిందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా, ఉత్తర ప్రదేశ్ చివరి స్థానం లో ఉందని వెల్లడించారు.

కాళేశ్వరం క్లియరెన్స్ కోసం…3ఏళ్ళు :

గోదావరి నదిపైన మూడున్నరేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేశామని మంత్రి హరీష్ రావు తెలిపారు.కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవల్ సాగునీటి ప్రాజెక్టుగా పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టు అనుమతులకోసం ఢిల్లీచుట్లు ప్రదక్షిణలు చేయాల్సి వచ్చిందన్నారు. తాను స్సెషల్ సిఎస్ , ఈఎన్సీలలో ఎవరో ఒకరు కేంద్ర జలసంఘంలోని వివిధ విభాగాల అధికారుల చుట్టు వంతులు వేసుకోని తిరిగితేగాని అనుమతులు రాలేదంటూ కేంద్ర జలవనరుల శాఖ తీరును ఎండగట్టారు. మూసీ పునరుద్ధరణ పనుకు ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారని, కొద్దిరోజుల్లోనే వాటి పనులు మొదలుపెడతారన్నారు. రెండుమూడేళ్లలో మూసి నదిని పూర్తిగా మంచినీటినదిగా మారుస్తామని, మూసి నదిపై వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుతున్నామని, మూసినదలో నీటిని ఆయనతో తాగిస్తామన్నారు. ప్రపంచంలోనే భూమి పై 50 టీఎంసీల నీటినిలువ సామర్ధంతో నిర్మించిన ఏకైక రిజర్వాయర్ మల్లన్న సాగర్ అన్నారు.మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ తో 13 జలాల్లో సాగునీరు అందుతుందన్నారు. హైదరాబాద్‌కు కూడా త్రాగు నీరు కూడా అందుస్తున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో రైతుబంధు సమితి అధ్యక్షులు పళ్లా రాజేశ్వర్ రెడ్డి, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ , తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్ , తదితరలు పాల్గొన్నారు. అనంతరం జలవనరుల రంగంలో విశేష కృషి చేసిన పలువురికి మంత్రి హరీష్ రావు అవార్డులు అందజేసి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News