Saturday, December 21, 2024

కేసుల లిస్టింగ్‌పై సిజెఐకి సీనియర్ న్యాయవాది దవే లేఖ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కేసుల లిస్టింగ్, ఇతర బెంచ్‌లకు వాటి కేటాయింపు విషయంలో చోటు చేసుకొంటున్న కొన్ని ఘటనలపై సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే ఆందోళన వ్యక్తం చేస్తూ వాటిని సరిచేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సిజెఐ డివై చంద్రచూడ్‌కు బుధవారం లేఖ రాశారు. హైకోర్టు జబ్జీల పదోన్నతి బదిలీలకు సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులపై చర్యలు తీసుకోవడంలో కేంద్రం జాప్యానికి సంబంధించిన కేసులు కోర్టు నంబర్ 2 కాజ్‌లిస్ట్‌నుంచి హటాత్తుగా తొలగించడంపై ప్రశాంత్ భూషణ్ సహా కొందరు సీనియర్ న్యాయవాదులు చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి ఎస్‌కె కౌల్ ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఒక రోజు తర్వాత దవే ఈ బహిరంగ లేఖ రాయడం గమనార్హం. ‘ భారత సర్వోన్నత న్యాయస్థానం రిజిస్ట్రీ చేత కేసలు లిస్టింగ్‌కు సంబంధించి చోటు చేసుకొంటున్న కొన్ని ఘటనలపై నేను తీవ్ర ఆవేదన చెందుతున్నాను’ అని సుప్రీంకోర్టు బార్ సోసియేషన్ మాజీ అధ్యక్షుడు కూడా అయిన దవే తన లేఖలో పేర్కొన్నారు.

కొన్ని కేసులు మానవ హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ వ్యవస్థల పనితీరు లాంటి సున్నితమైన అంశాలకు చెందినవి ఉన్నాయని కూడా ఆయన అన్నారు. సిజెఐని కలవడానికి కొంతమంది లాయర్లు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో తాను ఈ బహిరంగ లేఖ రాయాల్సి వచ్చిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సుప్రీంకోర్టులో కేసుల లిస్టింగ్‌కు సంబంధించిన నిబంధనలను, అలాగే రోస్టర్ అధిపతిగా సిజెఐకి ఉన్న పరిపాలనా అధికారాలను కూడా ఆయన తన లేఖలో పేర్కొన్నారు. మొదట ఒక బెంచ్ ముందు లిస్టింగ్ అయి, ఆ తర్వాత దానినుంచి తొలగించి మరో బెంచ్ ముందు లిస్టింగ్ చేసిన అనేక కేసులు వ్యక్తిగతంగా తన దృష్టికి వచ్చినట్లు కూడా దవే తన లేఖలో పేర్కొన్నారు. అత్యంత గౌరవప్రద వ్యవస్థ అయిన సుప్రీంకోర్టుకు ఇది ఎంతమాత్రం మంచిది కాదని ఆయన అంటూ తక్షణమే ఈ విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో సిజెఐని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News