ముంబయి: ఉత్తమ సహాయ నటిగా మూడు సార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్న బాలీవుడ్ సీనియర్ నటి సురేఖ సిక్రి శుక్రవారం ఉదయం తన 75వ ఏట గుండెపోటుతో మరణించారు. రెండు సార్లు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన సురేఖ సిక్రి ఇటీవల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో మొదటిసారి ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ రాగా ఆసుపత్రిలో చికిత్స పొంది కొద్ది రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల ఆమె మరోసారి బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. తమస్(1988), మమ్మో(1995), బధాయి హో బధాయి(2018) చిత్రాలకు ఆమె మూడుసార్లు జాతీయ ఉత్తమ సహాయ నటిగా అవార్డులు అందుకున్నారు. సలీం లంగ్డే పే మత్ రో, జుబేదా తదితర చిత్రాలలో ఆమె నటించిన పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. ఎనిమిదేళ్ల పాటు టెలివిజన్‌లో ప్రసారమై విశేష ఆదరణ పొందిన బాలికా వధు సీరియల్‌లో బామ్మగా ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. జోయా అక్తర్ దర్శకత్వంలో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ఘోస్ట్ స్టోరీస్(2020)లో ఆమె చివరిసారి కనిపించారు. ఆమెకు కుమారుడు రాహుల్ సిక్రి ఉన్నారు.