కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 2024, జూన్ 29వ తేదీ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్దకుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు.
2014 తర్వాత కాంగ్రెస్కు డి. శ్రీనివాస్ రాజీనామా చేసి బీర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన డీఎస్.. అనంతరం బీఆర్ఎస్ను వీడి మళ్లీ సొంతగూటికి చేరారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని నివాసంలో డీఎస్ పార్థీవదేహం ఉంచారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. డీఎస్ నివాసానికి కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు చేరుకుంటున్నారు. రేపు నిజాబామాద్లో డీఎస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.