Sunday, December 22, 2024

రాష్ట్ర రాజకీయాల్లో డిఎస్ చతురత

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ చతురతతో పరిస్థితులను తలకిందులు చేయగల నేతగా ధర్మపురి శ్రీనివాస్ (డిఎస్) గుర్తింపు పొందారు. డిఎస్‌గా సుపరిచితులైన ఆయన చేపట్టిన పదవులకు న్యాయం చేశారు. విద్యార్థి సంఘం నేతగా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ఆయన పని చేశారు. ధర్మపురి శ్రీనివాస్ ఇది పరిచయం అవసరం లేని పేరు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు డి.శ్రీనివాస్.

దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగి ఉండి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రుల నియామకాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి డిఎస్ పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చిందంటే ఆయన ఎంతటి ఉన్నత స్థాయికి ఎదిగారో అర్ధం చేసుకోవచ్చు. సుమారు దశాబ్ద కాలం పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని తన సారథ్యంలో తిరిగి అధికారంలోకి తెచ్చిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. వరుసగా 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడం ద్వారా జాతీయ నాయకత్వం దృష్టిని ఆయన ఆకర్షించారు.

1998లో ఉమ్మడి పిసిసి అధ్యక్షుడిగా…
1948 సెప్టెంబర్ 27వ తేదీన నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్‌లో జన్మించిన ధర్మపురి శ్రీనివాస్ నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తిచేశారు. 1974 నుంచి 1984 వరకు పదేళ్ల పాటు రిజర్వ్ బ్యాంక్ ఇండియాలో ఉద్యోగిగా పనిచేశారు. ప్రస్తుత నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్‌లు డిఎస్ కుమారులు. అర్గల్ రాజారాం న్యాయకత్వంలో రాజకీయాల్లోకి వచ్చిన డిఎస్ ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌లో పనిచేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన శ్రీనివాస్ నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

1989, 2004లో మంత్రిగా….
1989 నుంచి 1994ల మధ్య గ్రామీణాభివద్ధి శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా సేవలందించారు. 2004 నుంచి 2008 వరకు ఉన్నత విద్య, అర్బన్ లాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించిన డిఎస్ సుమారు దశాబ్దం పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేలా కృషి చేశారు. 2004లో టిఆర్‌ఎస్ (ప్రస్తుత బిఆర్‌ఎస్) కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలక పాత్ర పోషించిన డిఎస్, కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో వైఎస్‌తో కలిసి కీలక పాత్ర పోషించారు. ఆనాటి కాంగ్రెస్ పెద్దలు రాజారామ్ శిష్యుడిగా ఉమ్మడి రాష్ట్రానికి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షులుగా ఎదిగారు.

2016లో రాజ్యసభ సభ్యుడిగా….
2013 నుంచి 2015 వరకు శాసనమండలి సభ్యుడిగా డిఎస్ బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలి విపక్ష నేతగా పనిచేశారు. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తితో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిఆర్‌ఎస్‌లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ అంతర్ రాష్ట్ర వ్యవహరాల సలహాదారుగా పనిచేశారు. తనతో ఉన్న సాన్నిహిత్యంతో కెసిఆర్ డిఎస్‌కు 2016లో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు.

2022 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా….
బిఆర్‌ఎస్ పార్టీకి డిఎస్ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని సొంత జిల్లాకు చెందిన నేతలు ఆయనపై నిందలు మోపారు. దీనిని సవాల్ చేస్తూ తన తప్పిదాలను నిరూపించాలని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పలుమార్లు డిమాండ్ చేసిన డిఎస్ 2022లో బిఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరినట్లు జరిగిన ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేసిన డిఎస్ తనని వివాదాల్లోకి లాగవద్దని కోరారు. వయసు రీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ఆయన తెలిపారు.

సోనియాకు వీర విధేయుడిగా…
సోనియా గాంధీకి విధేయునిగా ధర్మపురి శ్రీనివాస్ గుర్తింపు పొందారు. ప్రణబ్ ముఖర్జీ లాంటి సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలను డిఎస్ నెరిపారు. జైపాల్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డితో ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News