Thursday, January 23, 2025

సీనియర్ దర్శకులు తాతినేని రామారావు మృతి

- Advertisement -
- Advertisement -

 

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ దర్శకులు తాతినేని రామారావు (84) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.

1938 సంవత్సరంలో కృష్ణా జిల్లాలోని కపిలేశ్వరపురంలో జన్మించిన దర్శకుడు తాతినేని రామారావు తెలుగు, హిందీ భాషల్లో దాదాపుగా 80 చిత్రాలను తెరకెక్కించారు. అప్పటి ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాశ్‌రావుకు ఆయన దగ్గరి బంధువు. తాతినేని రామారావు పరిశ్రమలోకి అడుగుపెట్టి ప్రకాశ్‌రావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొంత కాలం పనిచేశారు. 1966లో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి కాంబినేషన్‌లో ‘నవరాత్రి’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన ఎన్టీఆర్‌తో యమగోల, రాజేంద్రప్రసాద్‌తో గోల్ మాల్ గోవిందం, సూపర్ స్టార్ కృష్ణతో అగ్ని కెరటాలు వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. బ్రహ్మచారి, మంచి మిత్రులు, జీవన తరంగాలు, దొరబాబు, అనురాగ దేవత, పచ్చని కాపురం వంటి విజయవంతమైన చిత్రాలను ఆయన తెరకెక్కించారు.

ఇక ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ‘యమగోల’ చిత్రం తాతినేని రామారావుకు మంచి గుర్తింపు తెచ్చింది. అదే చిత్రాన్ని 1979లో హిందీలోకి ‘లోక్ పర్ లోక్’ పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్‌లోనూ మొదటి ప్రయత్నంలోనే హిట్ అందుకున్నారు. తాతినేని రామారావు తెరపై కథను చెప్పే తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేది. ఇక ఆయనను అందరూ నిర్మాతల దర్శకుడు అనేవారు. నిర్మాతకు ఓ రూపాయి మిగలాలి అని తపించేవారు. పలు రీమేక్ సినిమాలతో ఆకట్టుకున్నారు తాతినేని. తన దర్శకత్వంలోనే రూపొంది విజయం సాధించిన ‘ఆలుమగలు’ను హిందీలో ‘జుదాయి’ పేరుతో తెరకెక్కించారు. ‘కార్తిక దీపం’ను హిందీలో ‘మాంగ్ భరో సజనా’గానూ, ‘అంతులేని కథ’ను ‘జీవన్ ధార’గానూ రీమేక్ చేసి విజయాలు అందుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News