బీరుట్: దక్షిణ లెబనాన్‌పై సోమవారం ఇజ్రాయెలీ సాయుధ దళాలు జరిపిన వైమానిక దాడిలో హిజ్బుల్లా ఎలైట్ ర్దావాన్ దళానికి చెందిన సీనియర్ కమాండర్ ఒకరు మరనించారు. మైడాల్ సెలమ్ గ్రామంపై ఇజ్రాయెలీ దళాలు జరిపిన వైమానిక దాడిలో కారులో ప్రయాణిస్తున్న రాద్వాన్ దళానికి చెందిన డిప్యుటీ కమాండర్ విస్సమ్ అల్ తావిల్‌తోపాటు మరో సైనికుడు మరణించినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. ఇది చాలా తీవ్రమైన విషయమని, ఇక పరిస్థితి అదుపులో ఉండదని వర్గాలు తెలిపాయి.
గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ దాడులు ప్రారంభించిన తర్వాత జరిగిన వైమానిక దాడులలో దక్షిణ లెబనాన్‌లో 130 మందికి పైగా హిజ్బుల్లా సైనికులు మరణించారు. సిరియాలో 19 మంది మరణించారు. లెబనాన్‌పై పూర్తి స్థాయి యుద్ధం చేపట్టవద్దని హిజ్బుల్లా సెక్రటరీ జనరల్ సయ్యద్ హస్సన్ నస్రల్లా గత వారం టెలివిజన్‌లో ప్రసంగిస్తూ ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. తమతో యుద్ధాన్ని ఎవరైనా కోరుకుంటే వారికి పశ్చాత్తాపమే మిగులుతుందని ఆయన హెచ్చరించారు.