Sunday, December 22, 2024

తడి ఆరని నెత్తుటి గాయాల చరిత్ర

- Advertisement -
- Advertisement -

చరిత్ర నిర్మాణానికి కావాల్సిన ఆకరాలు సమగ్రంగా లభించకపోవడం వలన చరిత్రను రికార్డు చేయడం ఇంకా అసంపూర్తిగానే ఉండిపోతుంది. తెలంగాణ నేల మీద అనేక సామాజిక ఉద్యమాలు పురుడుపోసుకున్నాయి. రైతాంగ సాయుధ పోరాటం, భూమి, భుక్తి, విముక్తి పోరాటం, రైతు కూలీ ఉద్యమం, తునికి ఆకు ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం, విద్యార్థి ఉద్యమాలు, ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమం మొదలైనవి ఎన్నో ఈనేల మీద జరిగినా వాటి చరిత్రను సమగ్రంగా రికార్డు చేయలేకపోయాం. దానికి కారణం ఆయా ఉద్యమాలకుసంబంధించిన మౌలికమైన సమాచారం అందుబాటులో లేకపోవడమే.

ఈ లోటును భర్తీ చేయడానికి కొంతమంది చరిత్రకారులు, పరిశోధకులు, కొన్ని సంస్థలు, ఆయా ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తులు, జర్నలిస్టులు ప్రయత్నించారు. భారతదేశ సామాజిక చరిత్ర నిర్మాణానికి అదెంతో మేలు చేసిందని చెప్పొచ్చు. అలాంటి చరిత్ర నిర్మాణానికి ఉపయోగపడే మరో గ్రంథమే సీనియర్ జర్నలిస్ట్ మంగళారపు లక్ష్మణ్ రచించిన ‘మాయని గాయాల నెత్తుటి చరిత్ర’. పశ్చిమ బెంగాల్ రాష్ర్టంలోని నక్సల్బరీలో పుట్టిన నక్సలైట్ ఉద్యమం దాదాపు 20 రాష్ట్రాలను ప్రభావితం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్రకు చేరుకుంది. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలను ప్రభావితంచేస్తూ ఉత్తర తెలంగాణకు పాకి ఎంతో రక్తపాతాన్ని సృష్టించింది. పాత కరీంనగర్ జిల్లాను నక్సలైట్ ఉద్యమం అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈఉద్యమం విస్తరించి ఊహించని విధ్వంసానికి తెరలేపింది.

ముఖ్యంగా ఇందుర్తి నేటి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆనాడు తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ, నక్సలైట్‌ల మధ్య జరిగిన నాలుగు స్తంభాలాట ఈ గ్రంథంలో యధార్థంగా చిత్రింపబడింది. ‘ఊరు మనదిరా! ఈ వాడ మనదిరా! పల్లె మనదిరా! ప్రతి పనికి మనమురా! దొర ఏందిరో వాని పీకుడేందిరో, వీరులారా మీకు ఎర్రెర్ర దండాలు పాదపాదాన పరిపరిదండాలు, ఒరే ఒరే ఒరే ఎంకన్నా ఇంక లేవరో ఈ దోపిడీ దొంగల కూల్చా పరుగు తీయరో, ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది నేస్తమా రావా! దండు దండుకు డెభ్బై చేతులు పుట్టాయి.. నేస్తమా రావా, హోళీ హోళీల రంగ హోళీ చెమ్మకే లీల హోళీ యాడ బుట్టి యాడ పెరిగి, యాడకొచ్చి యాడ జచ్చె..” లాంటి పాటలు, రోమాలు నిక్కబొడుచుకునే ప్రసంగాలు ఎంతోమంది విద్యార్థులను విప్లవ సంస్థల్లో చేరేలా ప్రోత్సహించాయి.

రాత్రికి రాత్రే వ్యవస్థ పూర్తిగా మారిపోవాలని, అది తుపాకీ గొట్టం ద్వారానే సాధ్యమని నమ్మిన నక్సలైట్లు విప్లవోద్యమంలో చేరి ఒక దశలో తెలంగాణలో సమాంతర ప్రభుత్వాలను నడిపారు. దీంతో నక్సలైట్లకు, పోలీసులకు భీకర యుద్ధం మొదలైంది. ఈ రెండు వర్గాల పోరులో తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో పల్లెలు రక్తపుటేరులుగా మారిపోయాయి. గోడలన్నీ ఎరుపెక్కి పోస్టర్లు, చిన్నచిట్టీలే వ్యవస్థను నడిపించే దశకు చేరుకున్నాయి. తమది మాత్రమే పైచేయి కావాలని ఈ రెండు వర్గాలు తపించాయి. ఈ పోరులో ఎన్నో కుటుంబాలు బజార్లో పడ్డాయి. ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. 1980 నుంచి 2010 దాకా అంటే మూడు దశాబ్దాల ఉత్తర తెలంగాణ సామాజిక పోరాట స్వరూపం అంతా ఈ పుస్తకంలో కనిపిస్తుంది.

జనజీవన స్రవంతిలో కలవండని నిషేధం ఎత్తివేసిన మర్రిచెన్నారెడ్డి, ‘నక్సలైట్లే నిజమైన దేశభక్తులు’ అన్న నందమూరి తారక రామారావు, నక్సలైట్లతో చర్చలకు తెరతీసిన డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి పోరాట ఉధృతిని కొంత తగ్గించడానికి ప్రయత్నించారు. కాని నక్సలిజం మరింత పేట్రేగిపోయింది. ఈ పోరాట మార్గంలో ఇన్నేళ్లు పయనించిన తరువాత జరిగిన మేలెంత, నష్టమెంత అని ఒక మదింపు వేసుకోవడానికి ఈ గ్రంథం ఉపయోగపడుతుంది. రచయిత జర్నలిస్టు కావటాన ఇందులో పొందుపరిచిన సమాచారమంతా నెత్తురంటుకున్న యధార్థ మౌలిక సమాచారం కావడం గమనార్హం. దాదాపు రెండు దశాబ్దాల ఎన్నో సామాజిక సంఘటనలకు రచయిత ప్రత్యక్ష సాక్షి కావడం కూడా గమనించదగినది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయం గ్రామగ్రామానికి పాకింది. మెల్లగా ఆధిపత్యపోరు కూడా మొదలైంది. దీంతో ఇందూర్తి నియోజకవర్గం హత్యా రాజకీయాలకు కేంద్రంగా మారిపోయింది.

గునుకుల జనార్ధన్‌రెడ్డి, కరివేద సత్తిరెడ్డి, పిట్టల వెంకన్న, ముస్కు రాజిరెడ్డి, చింతపూల బాలయ్య, దుస్స కనకయ్య, పులి రాములు, కూన ముత్యాలు, దుస్స ప్రభాకర్ తదితరుల హత్యాకాండ ఆనాడు గ్రామాలను బీభత్స వాతావరణంలోకి నెట్టివేసింది. తెలుగుదేశం, పీపుల్స్‌వార్ మధ్య జరిగిన వర్గపోరులో ఎంతో మంది యువకులు బలిపశువులై నరకయాతన అనుభవించారు. క్షణక్షణం ఎంతో భయం భయంగా దొర్లిపోయేవి ఆ రోజులు.అయితే కొన్నిసార్లు నకిలీ నక్సలైట్ల బెడద కూడా ఉండేది. వ్యాపారస్థులను, రాజకీయ నాయకులను బెదిరించి డబ్బులు వసూలు చేసే ముఠాలు పెరిగిపోయాయి. సాదుల రామకృష్ణ, ఖాతా రాంచెంద్రారెడ్డి, ఆకుల రాఘవులు, శాంతి, ఒగ్గె చంద్రమౌళి, ఐలేని రాంరెడ్డి, సందె రాజమౌళి, భూపతి, పద్మక్క, గౌరీశంకర్ లాంటి ఎందరో ఉద్యమ నాయకుల జీవన ప్రస్థానం, ఉద్యమానికి వారి కాంట్రిబ్యూషన్ గురించి, ప్రస్తుత వారి స్థితిగతులు తదితర విషయాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు రచయిత మంగళారపు లక్ష్మణ్.

గాంధీనగర్, పోతారం (ఎస్), మాణిక్యపూర్, కోహెడ, పరివేద, రేకొండ, భీమదేవరపల్లి లాంటి గ్రామాలు ఎలా ఉద్యమానికి కేంద్ర బిందువులుగా నిలిచాయో రచయిత ఎన్నో ఉదంతాలతో సహా పేర్కొన్నారు. అంతేకాదు ఆనాటి కల్లోల కాలంలో జరిగిన ఒళ్ళు గగుర్పొడిచే సంఘటనలను కూడా ఈ పుస్తకంలో వివరించారు. ఎన్‌కౌంటర్లు, బస్సుల దహనం, ప్రభుత్వ కార్యాలయాల ధ్వంసం, అనేక మంది మీద బనాయించిన కేసులు, ఎన్నికలను బహిష్కరించిన సందర్భాలు, కిడ్నాపులు, సారా కాంట్రాక్టర్‌ల మీద జరిగిన దాడులు, టెలిఫోన్ ఎక్చేంజ్‌ల పేల్చివేతలు, అఖిలపక్ష బంద్‌లు, మందుపాతరలు, లొంగుబాట్లు ఇలా ఆనాడు సామాన్య ప్రజలను, ప్రభుత్వాలను ఎంతో ప్రభావితం చేసిన సంఘటనలను ఎన్నింటినో గుదిగుచ్చారు ఈ గ్రంథంలో. కరీంనగర్ జిల్లాలో 1972 నుండి 1990 మధ్యకాలంలో అమరులైన 88 మంది నక్సలైట్ల జ్ఞాపకార్థం 88 అడుగుల ఎత్తైన స్తూపాన్ని హుస్నాబాద్‌లో నిర్మించారు. ఇది ఆసియా ఖండంలోనే ఎత్తయిన స్థూపం. ప్రపంచంలో రెండవ ఎత్తయిన స్థూపంగా చరిత్ర పుటల్లో నిలిచింది. ఇందుర్తి గ్రామానికి చెందిన పీపుల్స్‌వార్ నాయకుడు పులి రాములు తండ్రి పులి మల్లయ్య చేతుల మీదుగా ఈ స్థూపం ఆవిష్కరింపబడింది. తరువాత 1991లో గ్రీన్‌టైగర్స్ పేరుతో ఈ స్థూపాన్ని పేల్చివేశారు.

ఇలాంటి ఎన్నో చారిత్రాత్మక సంఘటనల గురించి చాలా లోతుగా చర్చించిన పుస్తకం ఇది. భూముల కోసమే మొదలైన ఈ పోరాటాలు హుస్నాబాద్ ప్రాంతాన్ని ఎంతగానో కల్లోలపరిచాయి. ఎంతో మంది రాజకీయ నాయకుల, ఉద్యమకారుల, సామాన్య ప్రజల, విద్యార్థి నాయకుల అంతానికి దారి తీశాయి. కాలగమనంలో దశాబ్దాలు గడిచిపోయిన తరువాత ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ పోరాటల వలన సాధించింది ఏమిటి? నష్టపోయిందెవరు? జరిగిన అభివృద్ధి ఎంత అని ఒక అంచనాకు రావడానికి, భవిష్యత్తు ఉద్యమాలకు దిశానిర్దేశం చేసేది ఈ గ్రంథం. ఈ నేల మీద ఏ పోరాటం జరిగినా అంతిమంగా గెల్చేది మాత్రం ప్రజలే అనే ఒక ఎరుకను కలిగిస్తుందీ పుస్తకం. తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులందరూ పూనుకొని ఇలాంటి తమ ప్రాంత సామాజిక చరిత్రలను రచిస్తే రాబోయే తరాలకు ఎంతో మేలు కలుగుతుంది. ‘తుపాకీ గొట్టం ద్వారానే వ్యవస్థలో మార్పు వస్తుందని నక్సలైట్లు, రాజ్యాంగం ద్వారానే మార్పు తేవాలని పోలీసులు ఎవరు నమ్మిన సిద్ధాంతాలతో వారు పోరుబాట పట్టారు.

ఈ పోరులో ఇరు వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎంతో మార్పు కూడా జరిగింది. ప్రభుత్వాలు సంక్షేమ రంగం వైపు దృష్టి సారించాయి. దొరలు పారిపోయారు. గడీలు, కోటలు బీటలు వారాయి. పోలీసులు సామాన్యుడికి దగ్గరయ్యారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల వైఖరిలో కొంత మార్పు వచ్చింది’. (పుట 189) అందుకే ఈ రచయిత పుస్తక ముగింపులో వనాలొదిలి జనాల్లోకి రండి చివరి మజిలీనైనా సుఖశాంతులతో ముగించండి అని నక్సలైట్లకు పిలుపునిస్తారు.‘ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, పాలకులు ప్రజల అభీష్టం మేరకే పాలన సాగించాలి. అవినీతీ, లంచగొండితనం, దౌర్జన్యాన్ని పూర్తిగా తొలగించాలి. సామాజిన, ఆర్థిక, రాజకీయ అసమానతలు లేని స్వచ్ఛమైన పాలన సాగాలి’ (పుట 192) అంటారు రచయిత మంగళారపు లక్ష్మణ్. రచయిత ఆకాంక్ష నెరవేరుగాక.

డాక్టర్ వెల్దండి శ్రీధర్
98669 77741

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News