ప్రపంచ సూచీల్లో
దిగదుడుపు
ట్విట్టర్‌లో రిపోర్ట్ కార్డు
పెట్టిన ప్రశాంత్‌భూషణ్
న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై సీనియర్ న్యాయవాది, హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్ విమర్శలు గుప్పించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో భారత దేశం పరువును మోడీ బజారు కీడ్చారని దుయ్యబట్టారు. ఆయన పాలనా కాలంలో భారత్ ర్యాంకులు ఏమేరకు దిగజారాయో అంకెలతో సహా రుజువులు చూ పుతూ ఓ రిపోర్టు కార్డు తయారు చేశారు. ప్రశాంత్ భూషణ్ ట్విటర్‌లో పోస్టు చేసిన ఆ రిపోర్టు కార్డు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ కావడమే కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. పత్రి కా స్వేచ్ఛ, ప్రపంచ ఆకలి సూచీ, ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచిక సహా అనేక అంశాల్లో మోడీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఇప్పటి వరకు భారత్ స్థానాన్ని ఏ రకంగా దిగజార్చింది ప్రశాం త్ భూషణ్ అందులో వివరించారు. పత్రికా స్వేచ్ఛనే తీసుకుంటే 180 దేశాల్లో 150 స్థానానికి భారత్ పడిపోయిందని తెలుపుతూ ‘డి’ గ్రేడ్ కట్టబెట్టారు. ప్రపంచ ఆకలి సూచీలో 116 దేశాలను లెక్కలోకి తీసుకుంటే అందులో మనల్ని 101వ స్థానంలో నిల్చోబెట్టారని తద్వారా దారుణమైన ‘ఈ’గ్రేడ్‌కు దిగజార్చారని హ్యాపీనెస్ ఇండెక్స్(సంతోష సూచిక) లో 149 దేశాలకుగాను భారత్ 136 దగ్గరే ఆగిపోయిందని పేర్కొంటూ ‘ఈ’ గ్రేడ్ ఇచ్చారు.
ఐరాస ప్రతి ఏటా విడుదల చేసే మానవాభివృద్ధి సూచీలో 189 దేశాలుంటే అందులో భారత్ స్థానం 131 అంటూ ‘సి’ గ్రేడ్‌కు పరిమితం చేశారు, మానవ స్వేచ్ఛా సూచీలో 165 దేశాలను లెక్కలోకి తీసుకుంటే ‘సి’ గ్రేడ్‌తో 119, ప్రజాస్వామిక ఎన్నికల ఇండెక్స్‌లో 179 దేశాలను పరిగణనలోకి తీసుకుంటే భారత్ ‘సి’ గ్రేడ్‌తో 100వ స్థానం దగ్గర ఆగిపోయిందని తెలిపారు. స్వేచ్ఛాయుత ప్రజాస్వామిక సూచీ, డెలిబరేటివ్ కాంపొనెంట్ ఇండెక్స్‌లో 179 దేశాలకు గాను భారత్ 93(బి గ్రేడ్), 102 (సి గ్రేడ్) స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ప్రశాంత్ భూషణ్ వివరించారు. రిపోర్టు కార్డులో వ్యంగ్యంగా మోడీ కోర్సు పేరును ‘రాజనీతి శాస్త్రంలో మాస్టర్’గా అభివర్ణించారు. మోడీ కరుడుగట్టిన నియంతగా వ్యవహరిస్తున్నారని, దాన్ని విడనాడి రాజ్యాంగానికి, దాని విలువలను గౌరవించాల్సిన కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉందని రిపోర్టు కార్డు రిమార్కులో ప్రశాంత్ భూషణ్ హితవు పలికారు.