చత్తీస్‌గఢ్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆయన స్వస్థలం కరీంనగర్ జిల్లాలోని బీర్పూర్ గ్రామం
కాంకేర్ : మావోయిస్టు సీనియర్ నాయకుడు ప్రభాకర్‌రావు అలియాస్ బల్మూరి నారాయణ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. చత్తీస్‌గఢ్ కాంకేర్ జిల్లాలోని అంతగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారంనాడు ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారంనాడు ఆయన అరెస్ట్‌ను ప్రకటించారు. ప్రభాకర్‌రావు స్వస్థలం తెలంగాణలోని కరీంనగర్ జిల్లా బీర్పూర్ గ్రామం. ప్రభాకర్‌రావు తలపై రూ.25లక్షల రివార్డు ఉందని, వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఆయన అరెస్ట్ ఒక ముందడుగు అని ఓ సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు. ప్రభాకర్‌రావు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారని బస్తర్ రేంజ్ ఐజి సుందర్‌రాజు వెల్లడించారు.
57ఏళ్ల ప్రభాకర్‌రావు మావోయిస్టు అగ్రనేతలకు అత్యంత సన్నిహితుడని, నక్సల్స్‌కు సంబంధించిన లాజిస్టిక్స్ సరఫరా ఇంచార్జీగా కూడా వ్యవహరిస్తూ ఉంటారని వివరించారు. కొద్ది రోజులుగా ప్రభాకర్‌రావు కదలికపై నిఘా ఉంచామని, పక్కా సమాచారంతో ఆయనను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. తాజా అరెస్ట్ ఉత్తర బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ అని సుందర్‌రాజు అభివర్ణించారు. ఈ ప్రాంతంలో నక్సల్స్‌ను మరింత కట్టడి చేయడంలో ప్రభాకర్‌రావు అరెస్ట్ తోడ్పడుతుందన్నారు. చత్తీస్‌గఢ్ సహా వివిధ రాష్ట్రాల్లో ఆయనపై డజన్ల కొద్ది క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు.
ఒడిశా, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని మావోయిస్టు అగ్రనేతలతో ప్రభాకర్‌రావుకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్లు వివరించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు బసవరాజు, రామచంద్రారెడ్డి, దేవ్‌జీ, కొస, సోను, మల్లరాజ రెడ్డి అలియాస్ సంగ్రామ్, ప్రభాకర్‌రావు భార్య, డివిజనల్ కమిటీ సభ్యులు రాజె కాంగె(రావుఘాట్ ఏరియా కమిటీ)లతో ఈయనకు సత్సంబంధాలు ఉన్నట్లు ఐజి పేర్కొన్నారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్, చత్తీస్‌గఢ్‌లోని ఉత్తర బస్తర్, కొయిలిబెడ, మన్పూర్‌మొహ్ల ఏరియాల్లో ప్రభాకర్‌రావు విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించారని అన్నారు. 200507 మధ్య మావోయిస్టు సప్లై టీమ్, అర్బన్ నెట్‌వర్క్ కోసం కూడా పనిచేశారని తెలిపారు.