చండీగఢ్ : రెండేళ్ల క్రితం ప్రధాని మోడీ పంజాబ్‌లో పర్యటించినప్పుడు భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం కలిగించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి బఠిండా జిల్లా ఎస్పీ గుర్బీందర్ సింగ్‌ను విధుల్లోంచి సస్పెండ్ చేశారు. ఈమేరకు పంజాబ్ హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంఘటన సమయంలో ఆయన ఫిరోజ్‌పూర్ ఎస్పీగా ఉన్నారు. ప్రధాని పర్యటన సమయంలో ఫిరోజ్‌పూర్‌లో విధుల్లో ఉన్న గుర్బీందర్ సింగ్ నిర్లక్షంగా వ్యవహరించారని తమ దర్యాప్తులో తేలిందని రాష్ట్ర డిజిపి వెల్లడించారు. దీనిపై హోంశాఖకు నివేదిక అక్టోబర్ 18న సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించిన తరువాత సింగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు హోం శాఖ తమ ఉత్తర్వుల్లో పేర్కొంది.
2022 జనవరి 5న ప్రధాని మోడీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బఠిండా విమానాశ్రయంలో దిగారు. అక్కడ నుంచి ఆయన హెలికాప్టర్‌లో ఫిరోజ్‌పూర్ వెళ్లాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించలేదు. దీంతో ఆయన రోడ్డు మార్గంలో బయల్దేరారు. మరో 30 నిమిషాల్లో గమ్యస్థానం సమీపిస్తుందనగా, మోడీ వాహనశ్రేణి ఫ్లైఓవర్‌కు చేరుకుంది. ఆ సమయంలో వందలాది రైతులు ఆ మార్గాన్ని అకస్మాత్తుగా దిగ్బంధించారు. దీంతో దాదాపు 20 నిమిషాలు ప్రధాని మోడీ, ఆయన కాన్వాయ్ ఫ్లైఓవర్ పైనే చిక్కుకుపోయారు. ఎంతకీ పరిస్థితి మెరుగుపడక పోవడంతో ప్రధాని అక్కడ నుంచి వెనుదిరగవలసి వచ్చింది.