Thursday, January 23, 2025

పోటీకి సీనియర్లు విముఖం

- Advertisement -
- Advertisement -

టికెట్ కోసం దరఖాస్తు చేయని జానా రెడ్డి, గీతా రెడ్ఢి, విహెచ్, రేణుకా చౌదరి, నాగం జానార్ధన్ రెడ్డి

వారసుల కోసం పలువురు సీనియర్ల దరఖాస్తు
ఇల్లందు టికెట్ కోసం 36 మంది పోటీ

మనతెలంగాణ/హైదరాబాద్:  ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు పలువురు కాంగ్రెస్ నాయకులు పోటీకి దూరంగా ఉంటున్నారు. కొందరు తమ పిల్లలను పోటీలో నిలపగా, మరికొందరు వయస్సు సహకరించకపోవడంతో తాము పోటీ చేయడం లేదని పేర్కొంటున్నారు. పోటీకి దూరంగా ఉన్న వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులైన జానారెడ్డి, గీతారెడ్డి, వి.హనుమంతరావు, నిరంజన్ రెడ్డి, రేణుకాచౌదరి, నాగం జనార్ధన్‌రెడ్డి తదితరులు దరఖాస్తు చేయలేదు. అయితే ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మరికొందరు కాంగ్రెస్ అగ్రనేతలు మాత్రం దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి చూపడం విశేషం. వీరితో పాటు వారి వారసులు సైతం అభ్యర్థిత్వం కోసం ఆర్జీలు పెట్టుకోవడం గమనార్హం. గురువారం వరకు 723 మంది దరఖాస్తులు రాగా చివరి రోజు శుక్రవారం దరఖాస్తు చేసుకోవడానికి ఆశావహులు పెద్ద సంఖ్యలో గాంధీభవన్‌కు తరలిరావడంతో దరఖాస్తుల సంఖ్య వెయ్యికిపైగా నమోదయ్యినట్టు తెలిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ టికెట్ కోసం ఏకంగా 36 మంది పోటీ పడగా, అగ్ర నేతలు తమ వారసులను బరిలో దింపేందుకు దరఖాస్తు చేస్తున్నారు. ములుగు టికెట్ కోసం సీతక్క దరఖాస్తును ఆమె పిఏ గాంధీభవన్‌లో అందజేశారు.
ప్రతి నియోజకవర్గానికి సగటున 8-9 మంది అభ్యర్థులు
శుక్రవారం సాయంత్రానికి 119 నియోజకవర్గాలకు గాను వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చినట్టుగా గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. వివిధ జిల్లాల నుంచి కీలక నేతలు, గతంలో పోటీ చేసిన నాయకులు, ఆశావహులు, పలువురు పారిశ్రామిక వేత్తలు, సోషల్ వర్కర్లు, కుల సంఘాల నేతలు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి క్యూ కట్టారు. ప్రతి నియోజకవర్గానికి సగటున 8-9 మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాలకు పలువురు నాయకులు దరఖాస్తు చేసుకోగా, ప్రతి రోజు దరఖాస్తులు సమర్పించడానికి గాంధీభవన్‌కు ఆశావహులు పోటెత్తారు. దరఖాస్తులు భారీగా రావడంతో కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం వెల్లివిరిసింది.
జానారెడ్డి ఇద్దరు కుమారులు దరఖాస్తు
పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి షాద్‌నగర్ టికెట్ కోసం ఈర్లపల్లి శంకర్ దరఖాస్తు చేసుకోగా జానారెడ్డి తన ఇద్దరు కుమారులు రఘువీర్ రెడ్డి, జయవీర్ రెడ్డిలు టికెట్‌ల కోసం బరిలో నిలిచారు. మిర్యాలగూడ టికెట్ ఆశిస్తున్న జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి, నాగార్జునసాగర్ టికెట్ కోసం జానారెడ్డి చిన్న కుమారుడు జయవీర్ రెడ్డిలు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. కరీంనగర్ నియోజకవర్గానికి రమ్యారావు ఆమె కుమారుడు రితేష్ రావు దరఖాస్తు చేసుకోగా, ముషీరాబాద్ టికెట్ కోసం అంజన్‌కుమార్ యాదవ్, అనిల్ కుమార్‌లు దరఖాస్తు చేసుకున్నారు.
శుక్రవారం భారీగా దరఖాస్తులు
పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, అతని భార్య పద్మావతిలు శుక్రవారం గాంధీభవన్‌కు చేరుకుని టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. హుజూర్‌నగర్ స్థానం కోసం ఉత్తమ్‌కుమార్ రెడ్డి దరఖాస్తు చేయగా అతని భార్య పద్మావతి కోదాడ స్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, సీతక్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, సీడబ్యుసి సభ్యులు దామోదర రాజా నర్సింహ, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, సర్వే సత్యనారాయణ, బలమూరి వెంకట్, కొడంగల్‌కు – రేవంత్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, ఆంథోల్‌కు దామోదర రాజనర్సింహ, కూతురు త్రిష పేరుతో మరో దరఖాస్తు సమర్పించగా, ములుగు సీటు కోసం ధనసరి అనసూయ (సీతక్క), పినపాకకు సీతక్క కుమారుడు సూర్యం, మునుగోడు- పున్నా కైలాష్ నేత, ఖైరతాబాద్ – విజయారెడ్డి, రోహిణ్ రెడ్డి, వినోద్ రెడ్డి, మధిర టికెట్ కోసం భట్టి విక్రమార్క తదితరులు దరఖాస్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News