Monday, December 23, 2024

సీనియర్‌ల చూపు అసెంబ్లీ వైపు ?

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్‌ను వద్దనుకొని అసెంబ్లీ వైపు చూపులు….
ఎంపి వద్దనుకొని…ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తి
కాంగ్రెస్‌లో ఈసారి ట్రెండ్ మార్చిన సీనియర్ నాయకులు

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలంతా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీర్ఘకాలం పాటు గాంధీ భవన్ ముఖం కూడా చూడని నేతలు ఇప్పుడు దరఖాస్తులు సమర్పించుకోడానికి క్యూ కట్టారు. గతంలో ఎంపిలుగా పనిచేసిన వారు, ప్రస్తుతం లోక్‌సభ సభ్యులుగా ఉన్నవారు సైతం అసెంబ్లీకి పోటీ చేయడానికి రెడీ అయ్యారు. ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆశతో పలువురు కాంగ్రెస్ నాయకులు తమ అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి ఎమ్మెల్యే టికెట్ కోసం భారీగా దరఖాస్తు చేసుకున్నారు. కొందరు నాయకులు ఏకంగా రెండు, మూడు స్థానాలకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. సీనియర్ కాంగ్రెస్ నాయకులైన మాజీ ఎంపీలు మధు యాష్కీ, పొన్నం ప్రభాకర్, సర్వే సత్యనారాయణ, అంజన్‌కుమార్ యాదవ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులంతా గాంధీ భవన్‌లో ఎమ్మెల్యే టికెట్ కావాలని దరఖాస్తు చేసుకోవడం విశేషం. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సైతం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తన దరఖాస్తును అందజేశారు. టికెట్ కోసం దరఖాస్తు చేసుకోడానికి చివరి రోజు కావడంతో గాంధీ భవన్లో సందడి అనూహ్యంగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకోవడంతో ఆ రోడ్డంతా కోలాహలంగా మారింది.
నియోజకవర్గాన్ని మార్చేసిన మధుయాష్కీ
వీలైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటించడానికి ఆశావహుల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరించింది. ఈ దరఖాస్తులకు టిపిసిసి చీఫ్ నుంచి టికెట్ ఆశిస్తున్న సామాన్య కార్యకర్త వరకు అందరూ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని అధిష్టానం నిబంధన విధించడంతో దరఖాస్తుల స్వీకరణను గాంధీభవన్ ప్రారంభించింది. అయితే, ఇప్పటికే గతంలో ఎక్కడ పోటీ చేసిన వాళ్లు ఆ నియోజకవర్గానికే దరఖాస్తు చేసుకోగా కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ మాత్రం అనూహ్యంగా పోటీ చేసే నియోజకవర్గాన్ని మార్చేశారు. ఈ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ఎల్బీనగర్‌లో ముగ్గురు కాంగ్రెస్ నాయకుల మధ్య పోటీ
మధుయాష్కీ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి ధర్మపురి అర్వింద్ చేతిలో ఓటమి చెందారు. ఇప్పటికే ఎల్బీనగర్ టికెట్ కోసం అనేకమంది కాంగ్రెస్ ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక నేతలైన జక్కిడి ప్రభాకర్ రెడ్డి, మల్‌రెడ్డి రాంరెడ్డి పేర్లు ఇప్పటివరకు వినిపించగా అనూహ్యంగా నేడు మధుయాష్కీ దరఖాస్తు చేయడంతో ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. అధిష్టానం ఎవరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారో త్వరలోనే తేలుతుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
గోషామహాల్ నుంచి రాహుల్ సిప్లిగంజ్
ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విన్నర్‌గా పేరొందిన రాహుల్ సిప్లిగంజ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ఆయన గోషామహల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. బిగ్ బాస్‌లో రాహుల్ పాల్గొనకముందు మంగళ్ హాట్ ప్రాంతంలో ఉండేవారు. అనంతరం ఆయన తన నివాసాన్ని మాసాబ్‌ట్యాంక్‌కు మార్చినా ఆయన సెలూన్ మాత్రం నాంపల్లిలో నిర్వహిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో పాడిన పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఆయన ఒక్కసారిగా సెలబ్రిటీల జాబితాలో చేరిపోయారు. ఇలా రాహుల్ పేరు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ కారణంగానే మాస్ నుంచి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న రాహుల్ సిప్లిగంజ్ గోషామహల్ నుంచి పోటీ చేయిస్తే గట్టి పోటీని ఇవ్వవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న గోషామహల్లో ప్రస్తుతం సరైన అభ్యర్థులు లేకపోవడంతో ప్రత్యామ్నాయాన్ని వెతుకుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News