Monday, January 20, 2025

జరిగేది సంచలనమే

- Advertisement -
- Advertisement -

దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది

ప్రత్యామ్నాయ ఎజెండా దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి
నేతలందరితో చర్చిస్తున్నాం.. సమాలోచనలు జరుగుతున్నాయి కొత్త విద్యా విధానాన్ని కేంద్రం ఏకపక్షంగా తెచ్చింది దేశంలో ఉన్నది
సమాఖ్య వ్యవస్థ, అందరినీ సంప్రదించిన తర్వాతే నూతన విద్యా
విధానాన్ని అమలుచేసి ఉండాల్సింది కేంద్రం ఆ పని చేయలేదు :
ఢిల్లీ పర్యటనలో కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాజకీయ నాయకులు కలిసినప్పుడు రాజకీయాలే మాట్లాడుతాం… దేశంలో ఒక సంచలనం జరగాల్సి ఉంది… అది జరిగి తీరుతుంది… భవిష్యత్‌లో ఏం జరుగుతుందో అందరూ చూస్తారంటూ సిఎం కెసిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయాలు మాట్లాడే వేదిక కాదని, పవిత్రస్థలంలో ఉన్నాం కాబట్టి రాజకీయాలు మాట్లాడడం లేదని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం అఖిలేష్, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌లతో భేటీ గురించి విలేకరులు ప్రస్తావించగా ఆయన పైవిధంగా స్పందించారు. ఢిల్లీలోని దక్షిణ మోతీబాగ్‌లో ఉన్న సర్వోదయ స్కూల్‌ను ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌తో కలిసి శనివారం సాయంత్రం సిఎం కెసిఆర్ సందర్శించారు. విద్యావిధానంలో ఢిల్లీ సర్కార్ తీసుకొచ్చిన మార్పులు, డిజిటల్ విధానం, నూతన సంస్కరణలను కెసిఆర్ పరిశీలించారు. ఆ తర్వాత పాఠశాలకు సంబంధించిన డాక్యుమెంటరీని కేజ్రీవాల్‌తో కలిసి కెసిఆర్ వీక్షించారు. పాఠశాలలో ఉన్న వసతులు, ప్రత్యేకతలు, నిర్వహణ తీరును ఈ సందర్భంగా అధికారులు సిఎం కెసిఆర్‌కు వివరించారు. పాఠశాలలోని మౌలిక వసతులను కెసిఆర్ పరిశీలించారు. సిఎం కెసిఆర్ బృందానికి ఢిల్లీ డిప్యూటీ సిఎం, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా సాదర స్వాగతం పలికారు.

అనేక అంశాలపై చర్చలు, సమాలోచనలు జరుపుతున్నాం

అనంతరం సిఎం కెసిఆర్ విలేకరులతో మాట్లాడుతూ దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. మార్పు కోసం, ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. అందరూ నేతలతో దేశంలో తీసుకురావాల్సిన మార్పుల గురించి చర్చిస్తున్నాం.

అనేక అంశాలపై చర్చలు సమాలోచనలు సాగుతున్నాయని సిఎం కెసిఆర్ తెలిపారు. ఏకపక్షంగా కేంద్రం కొత్త విద్యావిధానం తెచ్చిందని ఆయన తప్పుబట్టారు. దేశంలో ఉన్నది సమాఖ్య వ్యవస్థ అని అందరిని సంప్రదించి మాట్లాడిన తర్వాతే నూతన విద్యా విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త విద్యా విధానంపై రాష్ట్రాలతో కేంద్రం సంప్రదించలేదని ఆయన విమర్శించారు. ఢిల్లీ తరహాలో విద్యావిధానం ఉంటే తాము కూడా ఆమోదిస్తామని, కానీ కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యారంగంలో ఢిల్లీ ప్రభుత్వ విధానం ప్రశంసనీయం

విద్యారంగంలో ఢిల్లీ ప్రభుత్వ విధానం ప్రశంసనీయమన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం పాఠశాలలను బాగా తీర్చిదిద్దిందని కెసిఆర్ ప్రశంసించారు. కేజ్రీవాల్ తన సొంత విధానాలతో పాఠశాలలను అభివృద్ధి చేశారన్నారు. విద్యార్థులను జాబ్ సీకర్లుగా కాకుండా జాబ్ ప్రొవైడర్లుగా మార్చుతున్నారన్నారు. ఇంత పెద్ద జనసంఖ్య ఉన్న మన దేశానికి ఇది చాలా అవసరమన్నారు. తెలంగాణలో ‘మనఊరు- మన బడి’ కార్యక్రమాన్ని ప్రకటించామని కెసిఆర్ తెలిపారు. తెలంగాణ నుంచి త్వరలో అధికారుల బృందాన్ని ఢిల్లీకి పంపించి ఢిల్లీ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటామన్నారు. తెలంగాణలోనూ ఈ విధానం అమలు చేస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. ఢిల్లీ బోధనా విధానాలు దేశం మొత్తానికి ఆదర్శనీయమన్నారు. పాఠశాల పనితీరు, కాన్సెప్ట్ బాగుందని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించామన్నారు.

మొహల్లా క్లీనిక్‌లు ప్రజలకు మంచి సేవలందిస్తున్నాయి

అనంతరం అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి సిఎం కెసిఆర్ మొహల్లా క్లీనిక్‌కు సందర్శించారు. అక్కడ అందిస్తున్న సేవలను అధికారులు కెసిఆర్‌కు వివరించారు. అనంతరం కెసిఆర్ మాట్లాడుతూ మొహల్లా క్లీనిక్‌లు ప్రజలకు మంచి సేవలందిస్తున్నాయన్నారు. మొహల్లా దవాఖానలను అనుకరిస్తూ హైదరాబాద్‌లో కూడా 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామని కెసిఆర్ తెలిపారు. కార్మికులు, పేదవారికి విద్య, వైద్య సంబంధమైన మంచి సేవలు లభిస్తే దేశం సంక్షేమంలో వర్ధిల్లుతుందన్నారు. ఢిల్లీ పట్టణంలో లభిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. వైద్య రంగంలో టూ టైర్ విధానంలో మొహల్లా క్లీనిక్, పాలిక్లీనిక్‌లు ప్రజలకు టెస్టులు, మందులు, ఇతరత్రా సేవలను అందిస్తున్నాయన్నారు. మొహల్లా క్లీనిక్‌లో ప్రైవేటు డాక్టర్లకు కూడా అవకాశం కల్పించారన్నారు. ఒక షిఫ్టులో 90 నుంచి 110, 120 మంది దాకా రోగులు వస్తున్నారని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఈరోజు గొప్ప విషయాలు చూసే అవకాశం కలిగిందని, చాలా మంచి కార్యక్రమాలు ఇక్కడ అమలు జరుగుతు న్నాయని దీనికి అరవింద్ కేజ్రీవాల్‌కు అభినందనలు తెలుపుతున్నానని కెసిఆర్ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం సాధించిన విజయం నిజంగా ప్రశంసనీయమైనదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా వ్యాపించాలని, దీంతో ప్రజలకు మంచి జరుగుతుందన్నారు.

సిఎం కెసిఆర్‌ను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా: అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌ను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానన్నారు. వారు ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారని ఆయన తెలిపారు. అధికారులను ప్రశ్నలు అడిగి పలు విషయాలను తెలుసుకున్నారన్నారు. ఈ విధంగానే దేశం ముందుకు సాగుతుందన్నారు. తాము ఒకరి నుంచి ఒకరం తెలుసుకుంటున్నామని ఢిల్లీ సిఎం తెలిపారు. సిఎం కెసిఆర్ తెలంగాణలో మంచి పనులు చేస్తున్నారని, తాము వారి నుంచి నేర్చుకుంటున్నామన్నారు. ఒకరి నుంచి ఒకరు నేర్చుకున్నప్పుడే దేశం ముందుకు సాగుతుందన్నారు. రాజకీయపరమైన సంప్రదింపులు నడుస్తున్నాయా అని విలేకరులు అడగ్గా తమకు రాజకీయాలు చేయడం రాదనీ, తమకు స్కూళ్లు, హాస్పటళ్లను నిర్మించడమే తెలుసని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ వెంట ఎంపిలు నామా నాగేశ్వర్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఎమ్మెల్యే డా.మెతుకు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News