Monday, December 23, 2024

కాంగ్రెస్ గెలిస్తే…రాష్ట్రాన్ని ఆంధ్రా టిడిపి చేతిలో పెట్టినట్లే

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ ఎంపి ధర్అమపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు

రేవంత్‌రెడ్డి కంటే సిఎంగా కెసిఆర్ మేలు
ప్రత్యేక రాష్ట్రం కోసం ఆలుపెరగని పోరాటం చేసిన నాయకుడు
ఉద్యమం సమయంలో రేవంత్ టిడిపిలో ఉండి, తెలంగాణ ఉద్యమంను వ్యతిరేకించారు
మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి కంటే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ ఎంతో మేలని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం 14 ఏళ్ల పాటు ఆలుపెరగని పోరాటం చేసిన పట్టు వదలని విక్రమార్కుడిలా అనేక రూపులుగా ఉద్యమించి 60 ఏళ్ల స్వరాష్ట్ర కలను నిజం చేశాడని ప్రశంసించారు. శనివారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొన ఆయన బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సిఎం కెసిఆర్ పోరాటం చేసిన సమయంలో రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా విమర్శలు చేసి, ప్రస్తుతం చంద్రబాబు చెప్పినట్లుగా రాజకీయ డ్రామాలు చేస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబుకు సంబంధించి నేతలంతా కాంగ్రెస్‌లో ఒక ముఠాగా ఉన్నారని, 2018 ఎన్నికల్లో హైదరాబాద్ తానే కట్టానని చెప్పుకున్న చంద్రబాబు ఎక్కడ ఉన్నాడన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో ఉన్న టిడిపి చేతిలో పెట్టినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణను హోల్‌సేల్‌గా రేవంత్‌రెడ్డి అమ్మేస్తాడని గతంలో బాబు కోసం సంచులు మోసుకెళ్లాడంటూ విమర్శలు చేశారు.

ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే అర్వింద్ రేవంత్ రెడ్డి కంటే సిఎం కెసిఆర్ మంచి నాయకుడు అనడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనే అర్వింద్ సిఎం కెసిఆర్‌పై ఇలాంటి వ్యాఖ్యలే చేసిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News