ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమై మధ్యాహ్నం గరిష్ఠాలకు చేరాయి. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాల్లోకి జారుకున్నాయి. గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ, ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు మార్కెట్‌పై ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 15.62 పాయింట్లు లేక 0.03 శాతం తగ్గి 61748.63 వద్ద ముగిసింది. నిఫ్టీ 3.10 పాయింట్లు లేక 0.02 శాతం తగ్గి 18261.30 వద్ద ముగిసింది. 1481 షేర్లు లాభపడగా, 1762 షేర్లు నష్టపోయాయి. 112 షేర్లు మార్పు లేకుండా యథాతథ స్థితిలో ముగిశాయి. నిఫ్టీలో దివీస్ ల్యాబ్స్, కోల్ ఇండియా లిమిటెడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభపడగా, యుపిఎల్, ఐటిసి, ఎస్‌బిఐ, బజాజ్ ఫైనాన్స్ ప్రధానంగా నష్టపోయాయి. 24 క్యారట్ల స్వచ్ఛమైన 10 గ్రా. బంగారం రూ. 373.00 లేక 0.61 శాతం పెరిగి రూ. 61300.00 వద్ద ట్రేడయింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం రేటు 0.23 పైసలు లేక 0.28 శాతం పెరిగి రూ. 82.04 వద్ద ట్రేడయింది.