ముంబై: దేశీయ సూచీలు దూకుడు ఏ మాత్రం తగ్గించలేదు. సూచీలు తమ జీవితకాల గరిష్ఠాలను తాకాయి. బ్లూచిప్ సెన్సెక్స్ రికార్డు స్థాయిని తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 211.16 పాయింట్లు లేక 0.34 శాతం పెరిగి 62504.80 వద్ద ముగిసింది. మధ్యాహ్నం 12.04 గంటలకు సెన్సెక్స్ 300 పాయింట్ల మేరకు కొత్త రికార్డు గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ50 వరుసగా ఐదో రోజున కూడా తన ర్యాలీని కొనసాగించింది, 50.00 పాయింట్లు లేక 0.27 శాతం పెరిగి 18562.75 వద్ద ముగిసింది. డెయిలీ ట్రేడింగ్‌లో నిఫ్టీ రికార్డు గరిష్ఠం 18604.35 పాయింట్లను మధ్యాహ్నం 12.31గంటలకు తాకింది. జెకె టైర్స్ 13 శాతం, సియట్ 7 శాతం రికార్డు స్థాయిలో లాభపడ్డాయి.
చైనాలో జీరో కొవిడ్ పాలసీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల కారణంగా ఆసియా మార్కెట్ షేర్లు ఉదయం స్తబ్ధుగానే మొదలయ్యాయి. మన దేశీయ సూచీలు కూడా నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. కానీ తర్వాత కోలుకున్నాయి. బ్యారెల్ క్రూడాయిల్ 2 డాలర్ల మేరకు క్షీణించడంతో మన సూచీలకు కలిసొచ్చింది. ప్రధానంగా పెయింట్ స్టాకులు లాభపడ్డాయి.
సెన్సెక్స్‌లో రిలయన్స్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ వంటి షేర్లు లాభాల్లో ముగిశాయి. కాగా టాటా స్టీల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సిఎల్ టెక్ షేర్లు నష్టపోయాయి. మొత్తం 2024 షేర్లు లాభపడగా, 1458 షేర్లు క్షీణించాయి, కాగా 185 షేర్లలో ఎలాంటి మార్పూ లేదు. మెటల్ షేర్లు మినహా అన్ని షేర్లు రాణించాయి. అమెరికా డాలరుతో పోల్చినప్పుడు రూపాయి విలువ రూ. 81.67 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది.