Sunday, December 22, 2024

ఆగని నష్టాలు

- Advertisement -
- Advertisement -

Sensex crashes 1017 points

పెరిగిన ద్రవ్యోల్బణం ఆందోళలు
అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు
మరోసారి వడ్డీ రేట్లను పెంచిన ఆర్‌బిఐ
గత వారం సెన్సెక్స్ 1,271 పాయింట్లు పతనం
(మార్కెట్ సమీక్ష)

న్యూఢిల్లీ : దేశీయ స్టాక్‌మార్కెట్లు పతనం బాటలోనే కొనసాగుతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా ద్రవ్యోల్బణం పెరగడం, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, ఇంకా వృద్ధి రేటుపై ఏజెన్సీల కోతలు వెరసి మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. గురువారం వరుస నష్టాలకు బ్రేక్ పడిందని అనుకుంటుండగా, ఆ మరుసటి రోజు శుక్రవారం భారీ నష్టాలను మూటగట్టుకుంది. వారాంతం మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1,017 పాయింట్లు పడిపోయి 54,303 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 276 పాయింట్ల పతనమై 16,202 పాయింట్ల వద్ద స్థిరపడింది. శుక్రవారం ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.3.11 లక్షల కోట్లు ఆవిరైంది.

దీంతో బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.251.84 లక్షల కోట్లకు తగ్గింది. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు బలహీనంగా ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.83 శాతం, స్మాల్ క్యాప్ 1.10 శాతం పతనమైంది. మొత్తం 15 రంగాలు కూడా రెడ్ మార్క్‌తో ముగిశాయి. స్టాక్స్ విషయానికొస్తే బజాజ్ ఫైనాన్స్ టాప్ నిఫ్టీ లూజర్ మిగిలింది. ఈ షేరు అత్యధికంగా 1.08 శాతం పడిపోయి రూ.5,658కు చేరింది. దేశీయ అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసి షేరు పతనం కొనసాగుతూనే ఉంది. ఈ స్టాక్ 1.70 శాతం పడిపోయి రూ.709.40 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలతో ఐటి, ఫైనాన్షియల్, ఎనర్జీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు కుదేలయ్యాయి. అయితే నాలుగు రోజులుగా నష్టపోతున్న మార్కెట్లకు గురువారం బ్రేక్ పడింది. సెన్సెక్స్ 428 పాయింట్లు పెరిగి 55,320 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 122 పాయింట్లు లాభపడి 16,478 పాయింట్ల వద్ద స్థిరపడింది. మిడ్, స్మాల్‌క్యాప్ షేర్లు లాభాలను నమోదు చేశాయి.

జిడిపి 7.5 శాతానికి తగ్గించిన ప్రపంచ బ్యాంక్
భారత్ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు అంచనాను ప్రపంచ బ్యాంక్ మరోసారి తగ్గింది. 202223 ఆర్థిక సంవత్సరానికి భారత్ జిడిపి అంచనాను 7.5 శాతానికి తగ్గిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. ద్రవ్యోల్బణం పెరగడం, సరఫరా వ్యవస్థ అంతరాయం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి కారణంగా జిడిపి అంచనాను తగ్గించినట్టు ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. 202223 (2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి) ఆర్థిక సంవత్సరానికి జిడిపి అంచనాను వరల్డ్ బ్యాంక్ తగ్గించడం ఇది రెండోసారి. గత ఏప్రిల్ నెలలో భారత్ జిడిపి అంచనా 8.7 శాతం నుంచి 8 శాతానికి తగ్గించింది. ఇప్పుడు 7.5 శాతానికి కోతపెట్టింది.

ఆర్‌బిఐ వడ్డీ రేటు అర శాతం పెంపు
రెండోసారి రెపో రేటును 0.5 శాతం పెంచుతూ ఆర్‌బిఐ నిర్ణయం తీసుకుంది. మే నెలలో 0.40 శాతం పెంచిన ఆర్‌బిఐ, జూన్‌లో మరోసారి 0.50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 4.40 శాతం నుంచి 4.90 శాతానికి పెరగడం వల్ల గృహ రుణాలు, ఇఎంఐలు మరింత భారం కానున్నాయి. బుధవారం ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వనంలోని ఎంపిసి (ద్రవ్యవిధాన సమీక్ష కమిటీ) వడ్డీ రేటు పెంపునకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ(ఎస్‌డిఎఫ్) రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్‌ఎఫ్) రేటును వరుసగా 4.65 శాతానికి, 5.15 శాతానికి ఆర్‌బిఐ పెంచింది. వృద్ధి రేటుపై కఠినంగా ఉండేందుకు ఆర్‌బిఐ సర్దుబాటు వైఖరిని మార్చుకోవాలనుకుంటోంది. 202223 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను 5.7 శాతం నుంచి 6.7 శాతానికి సవరించింది.

కానీ వృద్ధి రేటు అంచనాను మాత్రం 7.2 శాతం వద్ద గతంలో నిర్ణయించినదే కొనసాగించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆర్‌బిఐ ఆందోళన వ్యక్తం చేసింది. లక్షం పరిధి దాటి వెళ్లడంతో శక్తికాంత దాస్ ఆందోళన చేస్తూ, రానున్న రోజుల్లో రేట్లు మరింత పెరగొచ్చని అన్నారు. రెపో రేటు పెంపుతో గృహ రుణాల నుండి వాహన, వ్యక్తిగత రుణాల వరకు అన్నీ పెరగనున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులు రుణ రేట్లను పెంచాయి. ఆర్‌బిఐ రెపో రేటును తగ్గించినప్పుడు బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. దీంతో ఇఎంఐ కూడా తగ్గుతుంది. అదేవిధంగా రెపో రేటు పెరిగినప్పుడు వడ్డీ రేట్లు పెరగడం వల్ల కస్టమర్‌కు రుణ రేట్లు పెరగడంతో పాటు లోన్ ఇఎంఐలు భారం అవుతాయి. ఎందుకంటే వాణిజ్య బ్యాంకులు అధిక ధరలకు సెంట్రల్ బ్యాంక్ నుండి డబ్బును పొందుతాయి.

ఏప్రిల్‌లో పారిశ్రామిక ఉత్పత్తి 7.1 శాతం
ఏప్రిల్‌లో ఐఐపి (పారిశ్రామిక ఉత్పత్తి సూచీ) 7.1 శాతానికి చేరుకుంది. మార్చిలో ఐఐపి 1.9 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో దేశంలోని పారిశ్రామిక ఉత్పత్తిలో గణనీయ వృద్ధిని సాధించింది. ఇది దేశీయ ఆర్థిక వ్యవస్థలో రికవరీకి సంకేతంగా పరిగణిస్తున్నారు. నెలవారీ ప్రాతిపదికన తయారీ రంగం వృద్ధి 0.9 శాతం నుంచి 6.3 శాతానికి పెరిగింది. మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో ఐఐపి మెరుగైన వృద్ధిని చూసింది. ఐఐపి డేటాలోని ప్రధాన భాగాల రేటు, గనుల రంగం వృద్ధి ఏప్రిల్‌లో 7.8 శాతంగా ఉంది. ఇది మార్చిలో 4 శాతంగా నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News