650 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నా, ప్రపంచ మార్కెట్ల సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ మార్కెట్లు మాత్రం దూసుకెళ్తున్నాయి. సోమవారం నిఫ్టీ కీలక 18,000 మార్క్‌ను దాటింది. గతేడాది అక్టోబర్‌లో ఈ మార్క్‌కు చేరుకున్న నిఫ్టీ మళ్లీ పతనమైంది. ఆ తర్వాత ఇప్పుడు ఇదే మార్క్‌ను చేరుకుంది. గ్యాప్ అప్‌తో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. ఆఖరికి నిఫ్టీ 191 పాయింట్ల లాభంతో 18,017 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్ 650 పాయింట్లు పెరిగి 60,396 పాయింట్ల వద్ద స్థిరపడింది. ముఖ్యంగా హీరో మోటోకార్ప్, టైటాన్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఎస్‌బిఐ, ఎల్ అండ్ టి 4 శాతం మేరకు పెరిగాయి.
మరోవైపు విప్రో, దివీస్ ల్యాబ్, నెస్లె ఇండియా, టాటా కన్జూమర్ ప్రొడక్ట్, ఏసియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ షేర్లు టాప్ లూజర్లుగా మిగిలాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ 0.7 శాతం, స్మాల్‌క్యాప్ 1.2 శాతం పెరిగాయి. ఆనంద్ రతి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ నరేంద్ర సొలాంకి మాట్లాడుతూ, మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు పాజిటివ్‌గా ఓపెన్ అయ్యాయని అన్నారు. గత మూడు నెలలుగా విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరిపారు. ఇప్పుడు కొనుగోళ్లను ప్రారంభించారని, దీంతో మార్కెట్లు మళ్లీ పరుగులు పెడుతున్నాయని అన్నారు.