గతవారం 960 లాభపడిన సెన్సెక్స్
పెరిగిన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. గతవారం మార్కెట్ మొత్తంగా 960 పాయింట్ల లాభాలను నమోదు చేయగా, సెన్సెక్స్ మళ్లీ 59 వేల పాయింట్ల మార్క్‌ను దాటింది. విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు ప్రారంభించారు. వారాంతం శుక్రవారం రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రకటించడానికి ముందు దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలను చూశాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, కంపెనీల అద్భుతమైన త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 130 పాయింట్లు పెరిగి 59,462 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 39 పాయింట్ల లాభంతో 17,698 పాయింట్ల వద్ద స్థిరపడింది. రానున్న మూడు రోజుల పాటు స్టాక్‌మార్కెట్లు మూతపడనున్నాయి. శని, ఆదివారాలతో పాటు సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్టాక్ మార్కెట్‌కు సెలవులు ఉండనున్నాయి. ఐటి, ఫార్మా, ఎఫ్‌ఎమ్‌సిజి, మీడియా మినహా మిగిలిన అన్ని రంగాలు లాభపడ్డాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 26 షేర్లు గ్రీన్ మార్క్‌లో, 24 షేర్లు రెడ్ మార్క్‌లో ముగిశాయి.
కొనుగోళ్లు పెంచిన ఎఫ్‌ఐఐలు
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐ)లు జూన్ మధ్య నుంచి కొనుగోళ్ల వైపు మళ్లారు. శుక్రవారం ఒక్క రోజే ఎఫ్‌ఐఐలు రూ.3,040 కోట్ల కొనుగోళ్లు జరిపారు. అమెరికా ఫెడరల్ రిజర్వు ఇకపై వడ్డీ రేటు తగ్గింపు నెమ్మదిగానే ఉంటుందని, ద్రవ్యోల్బణం భయాలు అవసరం లేదని సంకేతాలు ఇచ్చింది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణను తగ్గించి, కొనుగోళ్ల జోరు పెంచారు. ఆగస్టు మొదటి వారంలో రూ.14,000 కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు జూలైలో కూడా విదేశీ ఇన్వెస్టర్లు మంచి కొనుగోళ్లు జరిపారు. డిపాజిటరీ డేటా ప్రకారం, ఎఫ్‌పిఐలు జూలైలో దాదాపు రూ. 5,000 కోట్ల నికర పెట్టుబడి పెట్టారు. ఏప్రిల్ మొదటి వారంలో ఎఫ్‌పిఐల మొత్తం పెట్టుబడి జూలై నెలలో మొత్తం పెట్టుబడి కంటే ఎక్కువగా ఉంది. వరుసగా తొమ్మిది నెలల ఉపసంహరణల తర్వాత ఎఫ్‌పిఐలు జూలై నుంచి నికర కొనుగోళ్లు ప్రారంభించారు. యెస్ సెక్యూరిటీస్, ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీల ప్రిన్సిపల్ అనలిస్ట్ హితేష్ జైన్ మాట్లాడుతూ, ఆగస్టులో ఎఫ్‌పిఐ ఇన్‌ఫ్లోలు సానుకూలంగా ఉంటాయని అంచనా వేస్తున్నామని అన్నారు. ఎందుకంటే రూపాయికి దారుణమైన పరిస్థితి ముగిసిందని, ముడి చమురు కూడా తక్కువ స్థాయిలోనే ఉందని అన్నారు. ఎఫ్‌పిఐ వ్యూహంలో మార్పు కారణంగా ఇటీవల మార్కెట్లో బలమైన ర్యాలీ కనిపిస్తోందని అన్నారు.
దిగొస్తున్న రిటైల్ ద్రవ్యోల్బణం
ఆర్‌ఐబి(భారతీయ రిజర్వు బ్యాంక్) నిర్ణయించిన లక్షం పరిధి 6 శాతం లోపు ఉండాలి. ఇప్పుడు రిటైల్ ద్రవ్యోల్బణం కూడా తగ్గుతోంది. జూలై నెలలో వినిమయ ధరల సూచీ(సిపిఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 6.71 శాతానికి దిగొచ్చింది. జూన్‌లో ఇది 7.01 శాతంగా ఉంది. ఏప్రిల్ నెలలో 7.79 శాతంతో ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరిన సూచీ ఇప్పుడు 1 శాతం వరకు తగ్గింది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ముడి చమురుతో సహా ఇతర వస్తువుల ధరలలో తగ్గుదల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో తగ్గింది. దీంతో 7 శాతం దిగువకు చేరింది. రైటిల్ ద్రవ్యోల్బణం మేలో 7.04 శాతం, ఏప్రిల్‌లో 7.79 శాతంగా ఉంది. ఇది మార్కెట్‌కు సానుకూల సంకేతం, దీంతో సూచీలు పెరగవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్‌బిఐ ద్రవ్యోల్బణం కట్టడీ లక్షంగా రిటైల్ ద్రవ్యోల్భణం టార్గెట్ 6 శాతం పరిధిలోకి వచ్చేంత వరకు రేటు పెంపు కొనసాగుతుందని సంకేతాలు ఇచ్చింది. ఈసారి రిజర్వు బ్యాంక్ దేశీయ వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం అంచనాల్లో రిజర్వు బ్యాంక్ మార్పు చేయలేదు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు 2022 మే నుంచి 140 బేసిస్ పాయింట్లు అంటే 1.40 శాతం మేరకు ఆర్‌బిఐ వడ్డీ రేటును పెంచింది.