587 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు మళ్లీ లాభాల బాటపట్టాయి. గురువారం ఉదయం తీవ్ర ఒడిదుడుకులను చూసిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు తర్వాత లాభాలతో ముగిశాయి. ఇంధనం, బ్యాంకింగ్ స్టాక్‌లలో కొనుగోళ్లు కనిపించాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు కూడా పుంజుకున్నాయి. సెన్సెక్స్ మళ్లీ 72,000 పాయింట్ల మార్క్‌ను దాటింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 587 పాయింట్ల లాభంతో 72,050 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 60 పాయింట్ల జంప్‌తో 21,910 పాయింట్ల వద్ద స్థిరపడింది.
ట్రేడింగ్‌లో ఎనర్జీ, బ్యాంకింగ్, ఆటో, ఐటి, మెటల్స్, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రా, ఆయిల్ అండ్ గ్యాస్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ వంటి రంగాల షేర్లు లాభపడ్డాయి. ఫార్మా, హెల్త్‌కేర్, ఎఫ్‌ఎంసిజి షేర్లు మాత్రమే క్షీణించాయి. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్‌లో కొనుగోళ్ల కారణంగా రెండు సూచీలు గొప్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 16 షేర్లు లాభపడగా, 14 నష్టాలతో ముగిశాయి. మార్కెట్‌లో మంచి పెరుగుదల కారణంగా పెట్టుబడిదారుల సంపద కూడా గణనీయంగా పెరిగింది. బిఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ రూ. 387.35 లక్షల కోట్లకు పెరిగింది.
గత సెషన్‌లో ఇది రూ. 384.74 లక్షల కోట్లుగా ఉంది. అంటే ఒక్క రోజులో ఇన్వెస్టర్ల సంపద రూ.2.61 లక్షల కోట్లు పెరిగింది. పెరిగిన స్టాక్‌లను పరిశీలిస్తే, మహీంద్రా అండ్ మహీంద్రా 6.51 శాతం, ఎన్‌టిపిసి 3.58 శాతం, పవర్ గ్రిడ్ 2.79 శాతం, ఎస్‌బిఐ 2.46 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2.15 శాతం, ఏసియన్ పెయింట్స్ 1.32 శాతం, విప్రో 0.82 శాతం లాభంతో ముగిశాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంక్ 2.11 శాతం, ఐటిసి 1.85 శాతం, హెచ్‌యూఎల్ 1.58 శాతం, నెస్లే 1.32 శాతం, సన్ ఫార్మా 0.79 శాతం, రిలయన్స్ 0.70 శాతం పతనంతో ముగిశాయి.