ముంబయి: సోమవారం కాస్త కోలుకున్నట్లు కనిపించిన స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ పతనమయ్యాయి. ఉదయం గ్యాపప్ ఓపెనింగ్ తో సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ తర్వాత దిగజారాయి. చివరివరకు ఒడుదుడుకులుగానే మార్కెట్ సాగింది. ప్రధాన కంపెనీలన్నీ నష్టాల బాట పట్టాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, ఐరోపా మార్కెట్లు సైతం మిశ్రమంగా కదలాడాయి. అమెరికా ఫ్యూచర్ మార్కెట్ మాత్రం పూర్తి నష్టాల్లో ట్రేడయింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియల్టీ లాభాలు చవిచూసినప్పటికీ, మెటల్స్ మార్కెటును కిందికి లాగేసింది. సెనెక్స్ 109.40 పాయింట్లు లేక 0.18 శాతం నష్టపోయి 60029.06 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ50 దాదాపు 40.70 పాయింట్లు లేక 0.23 శాతం నష్టపోయి 17888.95 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంకు సూచీ 174.70 పాయింట్లు లేక 0.44 శాతం లాభపడి 39938.45 వద్ద ముగిసింది. మారుతీ సుజుకీ బాగా లాభపడగా, టాటాస్టీల్ అతిగా నష్టపోయింది. సెక్టార్వైజ్గా చూసినప్పుడు నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ రంగం లాభాల్లో, నిఫ్టీ మెటల్ నష్టాల్లో ట్రేడయింది. లాభపడిని షేర్లలో మారుతీ, ఎన్టిపిసి, టైటాన్, ఎస్బిఐ, ఎల్అండ్ టి , బజాజ్ ఫినాన్స్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఆటో, హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. కాగా నష్టపోయిన షేర్లలో టాటాస్టీల్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, పవర్‌గ్రిడ్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్ ఉన్నాయి.