Thursday, January 23, 2025

మార్కెట్‌కు జిడిపి ఎఫెక్ట్

- Advertisement -
- Advertisement -

క్షీణిస్తున్న వృద్ధి రేటు,ద్రవ్యోల్బణంపెరుగుదలతో ఆందోళనలు
గతవారం సెన్సెక్స్ 617 పాయింట్లు పతనం (మార్కెట్ సమీక్ష)

Sensex falls 617pts over GDP

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి. గత వారం మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులను చూశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ మొత్తంగా 617 పాయింట్లు కోల్పోయింది. వారాంతం శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 49 పాయింట్లు కోల్పోయి 55,769 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 43 పాయింట్లు పడిపోయి 16,584 పాయింట్ల వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఆటోమొబైల్ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్లు డౌన్ అయ్యాయి.

మరోవైపు ఎఫ్‌ఐఐ (విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు) గతవారం అత్యధికంగా రూ.9,575 కోట్లు అమ్మకాలు జరిపారు. ద్రవ్యోల్బణం ఆందోళనలు, ప్రభుత్వం విడుదల చేసిన జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) గణాంకాలు వెరసి మార్కెట్లు నష్టపోయాయి. జిడిపి వృద్ధి రేటు వరుసగా మూడో త్రైమాసికంలో నెమ్మదించింది. 2022 జనవరిమార్చి త్రైమాసికంలో జిడిపి 4.1 శాతం నమోదైంది. పూర్తి సంవత్సరానికి గాను 8.7 శాతం నమోదైంది. అయితే మార్కెట్లో ఇన్వెస్టర్ల విషయానికొస్తే, ఆచితూచి వ్యవహరిస్తున్నారు, అప్రమత్తంగా ఉంటున్నారు.

విదేశీ ఇన్వెస్టర్లు రూ.9,575 కోట్ల అమ్మకాలు

ఇక వారాంత శుక్రవారం నాడు విదేశీ ఇన్వెస్టర్లు భారతదేశం ఈక్విటీ మార్కెట్లలో దాదాపు రూ.9,575 కోట్లు అమ్మకాలు, రూ.5,805 కోట్ల కొనుగోళ్లు జరిపారు. ఇక డిఐఐలు రూ.6,890 కోట్ల కొనుగోళ్లు, రూ.4,529 కోట్ల అమ్మకాలు చేపట్టారు. ఇక ఎఫ్‌ఐఐలు జూన్ 1న రూ.8,376 కోట్లు, జూన్ 2న రూ.7,583 కోట్ల అమ్మకాలు జరిపారు. ఇక డిఐఐ(దేశీయ ఇన్వెస్టర్లు) జూన్ 1న రూ.5,457 కోట్లు, జూన్ 2న రూ.4,677 కోట్లు సేల్స్ నిర్వహించారు. ఏది ఏమైనా విదేశీ ఇన్వెస్టర్ల విషయానికొస్తే నికరంగా అమ్మకాల విలువే ఎక్కువగా ఉంటోంది. దేశీయంగా కొనుగోళ్లు ఎక్కువగా ఉంటున్నాయి.

క్షీణించిన జిడిపి వృద్ధి రేటు

మంగళవారం నాడు ప్రభుత్వం విడుదల చేసిన జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) గణాంకాలు స్టాక్‌మార్కెట్లను నిరాశపర్చాయి. ఈ డేటా ప్రకారం, భారతదేశం జిడిపి వృద్ధి రేటు వరుసగా మూడో త్రైమాసికంలో తగ్గింది. 2022 జనవరిమార్చి త్రైమాసికంలో జిడిపి 4.1 శాతం నమోదైంది. పూర్తి సంవత్సరానికి గాను 8.7 శాతం నమోదైంది. అయితే గతేడాది అక్టోబర్‌డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన 5.4 శాతంతో పోలిస్తే ఈసారి స్వల్పంగా తగ్గింది.

2021 క్యూ1(ఏప్రిల్‌జూన్)లో 20.3 శాతం, క్యూ2(జూలైసెప్టెంబర్)లో 8.5 శాతం నమోదైంది. ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉండడం, వడ్డీ రేట్లు మరింత పెరగనున్న నేపథ్యంలో దేశీయ వృద్ధి రేటు మందగించింది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (202223) జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) అంచనాను 7.5 శాతానికి ఎస్‌బిఐ రీసెర్చ్ పెంచింది. గతంలో అంచనా నుండి 20 బేసిస్ పాయింట్ల పెంచుతూ జిడిపిని సవరించింది.

మేలో ఆటో సేల్స్ అదుర్స్

మే నెలలో ఆటోమొబైల్ కంపెనీల వాహనాల అమ్మకాలు బాగున్నాయి. బుధవారం నాడు విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, కియా, స్కొడా, బజాజ్ వంటి కంపెనీల సేల్స్ వృద్ధిని సాధించాయి. గతేడాది మేలో లాక్‌డౌన్ కారణంగా వాహనాల సేల్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే ఈసారి చాలా ఆటో కంపెనీల అమ్మకాలు పెరిగాయి. టాటా మోటార్స్ అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన మూడు రెట్లు ఎక్కువ వృద్ధిని సాధించాయి. ఇక మారుతీ అమ్మకాలు కూడా భారీగా నమోదయ్యాయి. మారుతీ దాదాపు 1,61,413 యూనిట్లను సేల్ చేసింది. గతేడాది(2021) మే నెలలో స్వల్పంగా 41,555 యూనిట్లను మాత్రమే సంస్థ విక్రయించింది.

ఇక గత నెలలో దేశీయ అమ్మకాలు 1,34,222 యూనిట్లుగా ఉండగా, 2021 మేలో 35,293 యూనిట్లు నమోదైనాయి. 2021 మే నెలతో 2022 మే నెల అమ్మకాల గణాంకాలను పోల్చలేమని, గతేడాది కరోనా మహమ్మారి కారణంగా సేల్స్ అంతగా లేవని కంపెనీ వెల్లడించింది. మే నెలలో టాటా మోటార్స్ అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. గత నెలలో ఈ కంపెనీ దేశీయ, విదేశీ అమ్మకాలు 76,210 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది మేలో 26,661 యూనిట్లు నమోదైనాయి. ప్యాసింజర్ వాహన విభాగంలో 43,341 కార్లతో 185 శాతం వృద్ధిని సాధించింది. 15,181 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. వాహన అమ్మకాల జోష్ వచ్చేవారం మార్కెట్‌పై కనిపించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News