Wednesday, January 22, 2025

వచ్చేవారం మార్కెట్లకు ప్రతికూలం..?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశీయ స్టాక్‌మార్కెట్ల దూకుడు కొనసాగుతూనే ఉంది. మార్కెట్లు రోజు రోజుకీ సరికొత్త శిఖరానికి చేరుకుంటున్నాయి. తాజాగా సెన్సెక్స్ కీలక 72,500 మార్క్‌ను దాటింది. ఇక నిఫ్టీ 21,900 మార్క్‌కు చేరువైంది. మరోవైపు బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ మొదటిసారిగా చారిత్రక గరిష్ఠమైన రూ.373.29 లక్షల కోట్లకు చేరింది. గురువారం ఇది రూ.370.48 లక్షల కోట్లుగా ఉంది. అంటే ఒక్క రోజులో రూ.3 లక్షల కోట్ల వరకు ఇన్వెస్టర్లు లాభపడ్డారు. వారాంతం శుక్రవారం స్టాక్‌మార్కెట్ ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. సెన్సెక్స్ 847 పాయింట్లు లాభంతో 72,568 వద్ద ముగిసింది.

ఇక నిఫ్టీ 247 పాయింట్ల లాభంతో 21,894 వద్ద స్థిరపడింది. ఐటి, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లలో అత్యధికంగా కొనుగోళ్లు జరిగాయి. నిఫ్టీ ఐటి ఇండెక్స్ 5.14 శాతం లాభంతో ముగిసింది. 202324 క్యూ3 ఫలితాల తర్వాత ఇన్ఫోసిస్ షేర్లు రూ.120.80 (8.08 శాతం) పెరిగి రూ.1,615 వద్ద ముగిసింది. టిసిఎస్ 3.92 శాతం లాభంతో రూ.3,882 వద్ద ముగిసింది. టిసిఎస్, ఇన్ఫోసిస్ డిసెంబర్ త్రైమాసిక ఫలితాల తర్వాత చాలా ఐటి స్టాక్‌లలో పెరుగుదల కనిపించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో టిసిఎస్ నికర లాభం సంవత్సరానికి 2 శాతం పెరిగి రూ.11,058 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.10,846 కోట్లుగా ఉంది.

ఫలితాల విడుదలతో పాటు టిసిఎస్ డివిడెండ్ ప్రకటించింది. మరోవైపు ఇన్ఫోసిస్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 7.3 శాతం క్షీణించి రూ.6,106 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇన్ఫోసిస్ రూ.6,586 కోట్ల లాభాన్ని ఆర్జించింది. డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లో బలమైన అంచనాలతో మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. అమెరికా ఫెడ్, ఆర్‌బిఐ 2024 మొదటి అర్ధ భాగంలో వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే సంకేతాలు మార్కెట్‌కు సానుకూలంగా మారాయి. ఇన్ఫోసిస్ లాభం 7.3 శాతం తగ్గింది, టిసిఎస్ లాభం 2 శాతం పెరిగింది.

వచ్చే వారం ద్రవ్యోల్బణం పెరగడం మార్కెట్లకు ప్రతికూలంగా మారే అవకాశముంది. 2023 డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.69 శాతంతో నాలుగు నెలల గరిష్ఠానికి చేరుకుంది. నవంబర్‌లో ఇది 5.55 శాతంగా ఉంది. 2022 డిసెంబర్‌లో ఇది 5.72 శాతంగా ఉంది. ఆహార ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 9.53 శాతానికి పెరగ్గా, గతేడాది ఇది 4.19 శాతంగా ఉంది. 2023 నవంబర్‌లో ఇది 8.7 శాతంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News